జాతీయ ఉత్తమ మండల సమాఖ్యగా ఎల్కతుర్తి

జాతీయ ఉత్తమ మండల సమాఖ్యగా ఎల్కతుర్తి
  • తెలంగాణ నుంచి మొదటిసారి ఎంపిక
  • వచ్చే నెల 22న హైదరాబాద్ లో అవార్డు ప్రదానం

ఎల్కతుర్తి, వెలుగు : జాతీయస్థాయి ఎస్ హెచ్ జీ ‌‌–--2024కి  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల సమాఖ్య ఎంపికైంది. దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్ హెచ్ జీ) మహిళా సమాఖ్యల నుంచి ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సంస్థ (ఏపీఎంఏఎస్), ఎస్ బీఐ, ఎఫ్ డబ్ల్యూడబ్ల్యూ బీ, ఎనేబుల్ నెట్‌వర్క్, ప్రధాన్, డీజీఆర్వీ జర్మన్ సంస్థలు సంయుక్తంగా మూడేళ్లుగా ఏటా జాతీయ స్థాయిలో నామినేషన్లు స్వీకరించి బహుమతులు ఇస్తున్నాయి. సమాఖ్య పనితీరు, సేవలు, వనరులు, ఆస్తుల నిర్వహణ, నాణ్యత, సమావేశాలు, హాజరు

రుణాల స్వీకరణ, చెల్లింపులు, పొదుపు, సభ్యుల పనితీరు, స్వయం సమృద్ధి సాధనలో సాధించిన లక్ష్యాలను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేస్తుంటాయి.  గత ఆగస్టులో తొలి విడత, ఈనెల 9న రెండో విడత నామినేషన్లు స్వీకరించాయి. దేశవ్యాప్తంగా 200 సమాఖ్యల నుంచి నామినేషన్లు వెళ్లాయి.  ఇందులో ఎల్కతుర్తి ఉత్తమ సమాఖ్యగా ఎంపికైంది. వచ్చే  నవంబర్ 22న హైదరాబాద్ లో జరిగే జాతీయ స్థాయి సదస్సులో ఎల్కతుర్తి మండల సమాఖ్య అధ్యక్షురాలు

ఆర్. స్వర్ణలత అవార్డును అందుకుంటారు.  సమాఖ్య  పరిధిలో 942 సంఘాలు ,10,422 మంది సభ్యులు ఉన్నాయి. ఉత్తమ అవార్డుకు ఎంపికవడంపై మండల సమాఖ్య పాలకవర్గం, ఏపీఎం రవీందర్​, వీవోఏలు, సిబ్బంది, సంఘ సభ్యులను కలెక్టర్​ ప్రావీణ్య, జిల్లా ప్రాజెక్టు అధికారి నాగపద్మజ, ఏపీడీ సుధీర్ అభినందించారు.