
- మూడేండ్లుగా ఆస్తి పన్ను బకాయిలు రూ. 44 లక్షలు
- రెడ్ నోటీస్ జారీ చేసినా స్పందించని మేనేజ్ మెంట్
- కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలతో అధికారుల చర్యలు
వరంగల్సిటీ, వెలుగు : మూడేండ్లుగా బకాయి పడిన ఆస్తి పన్ను రూ. 44 లక్షలు కట్టని కారణంగా హనుమకొండలోని జయ నర్సింగ్ కాలేజీని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలతో సీజ్ చేశారు. డిప్యూటీ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. జయ నర్సింగ్ కాలేజీ మేనేజ్ మెంట్ కోర్టులో కేసు సాకుతో నడుపుతుందని, బకాయి పన్నులు చెల్లించాలని కోరుతూ అధికారులు పలుమార్లు రెడ్ నోటీస్ జారీ చేసినట్టు చెప్పారు.
అయినా మేనేజ్ మెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మంగళవారం ఉదయం నర్సింగ్ కాలేజీ విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపించి సీజ్ చేసినట్టు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించనివారిని గుర్తించి ఇప్పటికే సుమారు 356 ఆస్తులను సీజ్ చేశామని పేర్కొన్నారు. గ్రేటర్ ప్రజలు పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని సూచించారు. ఆర్ ఓ యూసుఫోద్దిన్ ,ఆర్ఐలు సురేష్ ,రజని, భరత్ చంద్ర, శ్రీకాంత్, బిల్ కలెక్టర్లు ఉన్నారు.