- రోడ్డు పక్కనే భారీ స్థాయిలో డ్రైనేజీ నిర్మాణం
- రక్షణ ఏర్పాట్లను పట్టించుకోని ఆఫీసర్లు
- సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు
- మేడారం జాతర నేపథ్యంలో మరింత పెరగనున్న రద్దీ
వరంగల్, వెలుగు : హనుమకొండ కేయూసీ వంద ఫీట్ల రోడ్డు వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారింది. రోడ్డు పనులను ఇటీవల పూర్తి చేసిన ఆఫీసర్లు ఇరువైపులా భారీ స్థాయిలో డ్రైనేజీ నిర్మించారు. కానీ రోడ్డుకు, డ్రైనేజీకి మధ్య ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. దీంతో వాహనాలు అదుపుతప్పి డ్రైనేజీలో పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 54 కోట్లతో డ్రైనేజ్ కమ్ డక్ట్ పనులు
గ్రేటర్ వరంగల్‌లో ఏటా వానాకాలంలో వచ్చే వరదల కారణంగా వందలాది కాలనీలు నీట మునుగుతున్నాయి. దీంతో కేయూ రోడ్డులోని గోపాల్‍పూర్ ఊర చెరువు నుంచి సమ్మయ్య నగర్ ప్రెసిడెన్సీ స్కూల్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కమ్ డక్ట్ పనులు చేపట్టారు. ఈ పనుల కోసం కేంద్రం స్మార్ట్ సిటీ కింద రూ.54 కోట్లు కేటాయించింది. దీంతో 2021 జులై, ఆగస్ట్ నెలల్లో మొదలైన పనులు డిసెంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆఫీసర్లు అంతగా పట్టించుకోకపోవడంతో టెండర్ల అప్రూవల్ ఆలస్యమైంది.
తర్వాత 2022 జనవరిలో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మూడు నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి సుమారు రెండేండ్లు సాగదీశారు. ఇన్ని రోజుల పాటు రోడ్డును పూర్తిగా బ్లాక్ చేయడంతో వరంగల్, హనుమకొండ, కాజీపేట మీదుగా ప్రయాణించే వేలాది మంది పడరాని పాట్లు పడ్డారు. ఈ లోపు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో జనాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి నాలుగైదు నెలల కింద హడావుడిగా డ్రైనేజీ పైభాగంలో స్లాబ్, డాంబర్ వేసి వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు.
తారు పోసిన్రు.. ఇతర పనులు మరిచిన్రు
కేయూ వంద ఫీట్ల రోడ్డులో ఎస్‌డీఎల్‌సీ జంక్షన్ నుంచి ఊర చెరువు వరకు గతంలో విశాలమైన రోడ్లు, మధ్యలో డివైడర్లు, అందమైన పూలమొక్కలు, సెంట్రల్ లైటింగ్ ఉండేవి. కానీ ఇటీవల పనులు పూర్తి చేసిన ఆఫీసర్లు కేవలం తారు వేసి మిగతా అభివృద్ధి పనులను గాలికి వదిలేశారు. రోడ్డుకు ఇరువైపులా వరద నీరు పోవడానికి 10 నుంచి 12 ఫీట్ల లోతుతో కాల్వలు నిర్మించారు.
కానీ మెయిన్ రోడ్డు, కాల్వల మధ్య ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. దీంతో వాహనాలు ఏ కాస్తా అదుపుతప్పినా పక్కనే ఉన్న కాల్వలో పడి పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. అలాగే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మేడారం జాతరతో పెరిగిన రద్దీ
హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం నుంచి కరీంనగర్, వరంగల్ వెళ్లాల్సిన వాహనదారులు ఇదే రోడ్డు మీదుగానే వెళ్తుంటారు. దీంతో సాధారణ రోజుల్లోనే ఈ రోడ్డు రద్దీగా కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండడం, ముందస్తు మొక్కుల కోసం ప్రజలు మేడారం వెళ్తుండడంతో వాహనాల రద్దీ పెరిగింది. ఇక జాతర జరిగే మూడు రోజుల్లో మరిన్ని వాహనాలు వచ్చే అవకాశం ఉంది.
రోడ్డుకు ఇరువైపులా రక్షణ చర్యలు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ఈ రోడ్డుపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసర్లు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
డ్రైనేజీలో పడితే ప్రాణాలు పోతయ్
కేయూ జంక్షన్ నుంచి గోపాల్‍పూర్ చెరువు మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న డ్రైనేజీ డేంజర్‍గా ఉంది. రోడ్డు పక్కన 10 ఫీట్ల ఎక్కువ లోతు డ్రైనేజీ తవ్వారు. ఈ రోడ్డు వెంట వెళ్లే వాహనాలు ఏ మాత్రం అదుపుతప్పినా డ్రైనేజీలో పడటం ఖాయం. అదే జరిగితే ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయంగా ఉంది.
- కట్ట రవి, టీవీ టవర్ కాలనీ