డబ్బులు అడిగితే రాత్రంతా నిర్బంధం

డబ్బులు అడిగితే రాత్రంతా నిర్బంధం
  • నైట్​ మొత్తం చిట్​ఫండ్​ ఆఫీసులోనే బాధితుడు
  • ప్రాణభయంతో స్నేహితులకు సెల్ఫీ వీడియో
  • ఉదయం స్టేషన్​కు తరలించిన పోలీసులు

హనుమకొండ, వెలుగు: తనకు రావాల్సిన ​డబ్బులు అడిగినందుకు చిట్​ ఫండ్​ నిర్వాహకులు బాధితుడిని ఆఫీస్​ రూంలో బంధించారు. డబ్బుల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా రాత్రంతా నిర్బంధించి ఇంటికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేశారు. ప్రాణభయంతో బాధితుడు తన స్నేహితులకు సెల్ఫీ వీడియో పంపించి తన ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు తెలిపిన ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన ధర్ముల ప్రతాప్​ లారీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు.

హనుమకొండలోని కనుకదుర్గ చిట్​ ఫండ్స్​లో 2020లో సంవత్సర కాలపరిమితితో రూ.5 లక్షలు డిపాజిట్​ చేశాడు. 2021లో ప్రతాప్​ కు డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉండగా.. ఆయనకు తెలియకుండానే రెన్యూవల్  చేశారు. అప్పటి నుంచి డబ్బుల కోసం ఆఫీస్​ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో గోపాల పూర్​ క్రాస్​ రోడ్డు వద్ద ఉన్న చిట్​ ఫండ్ ఆఫీస్​ కు వెళ్లాడు. డబ్బులు ఇస్తామని రాత్రి వరకు వెయిట్​ చేయించిన నిర్వాహకులు, ఆయనను మరో రోజు రావాలని సూచించారు.

ప్రతిసారీ ఇలాగే జరుగుతుండటంతో డబ్బులు ఇచ్చేదాకా కదిలేది లేదని ప్రతాప్​ స్పష్టం చేశాడు. దీంతో సంస్థ నిర్వాహకులు ఆయనను లోపలే ఉంచి, ఆఫీస్​కు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. తాళం వేసి అందరూ వెళ్లిపోవడంతో భయపడిపోయిన ప్రతాప్​ తనను ఏం చేస్తారో తెలియడం లేదని, సెల్ఫీ వీడియో తీసి తన స్నేహితులకు పంపించాడు.

డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని, డబ్బులు అడిగినందుకు చంపుతారనే భయమేస్తుందని వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పటికే వరంగల్ సీపీకి కూడా ఫిర్యాదు చేశానని, అయినా తనకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, రాత్రంతా అదే ఆఫీస్​లో ఉన్న ఆయనను మంగళవారం ఉదయం కేయూ పోలీసులు తీసుకెళ్లారు. ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.