హనుమకొండ, వెలుగు: ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడిని శ్మశాన వాటికకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడంతో పాటు నగదు, సెల్‌ఫోన్ తో తీసుకుని పరారైన దారి దోపిడీ దొంగలను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదైన 12 గంటల్లోనే నిందితులను పట్టుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ పర్తి మండలం దేవన్నపేటకు చెందిన రాజ్కుమార్ఎలక్ట్రీషియన్గా పని చేస్తుంటాడు.
సోమవారం పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం గోపాలపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఎదురుచూస్తుండగా.. హనుమకొండ లష్కర్‌సింగారం ప్రాంతానికి చెందిన జన్ను రాజ్‌కుమార్, పోచమ్మ మైదాన్‌కు చెందిన కట్కూరి యాకుబ్, ఆయన భార్య కట్కూరి రేణుక అక్కడికి వచ్చారు. ఆటో కోసం ఎదురుచూస్తున్న రాజ్‌కుమార్ వద్దకు వెళ్లి అకారణంగా అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి గుర్తు తెలియని ఆటోలో పోచమ్మకుంట శ్మశాన వాటికలోనికి తీసుకెళ్లారు.
అక్కడ మరోసారి అతడిపై దాడి చేసి, అతని వద్ద ఉన్న రూ.10 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను గుంజుకున్నారు. అనంతరం బాధితుడి ఫోన్‌పే నుంచి మరో రూ.వెయ్యి తమ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుని, అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యారు. బాధితుడు రాజ్ కుమార్ వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం మంగళవారం సాయంత్రం హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సీఐ సతీశ్, ఎస్సై సతీశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితుల నుంచి రూ.900 నగదు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.