- బాధితుల్లో మాజీ అడిషనల్ ఎస్పీ కుటుంబం
- కొడుక్కి జాబ్ వస్తుందని డబ్బులిచ్చిన ఆఫీసర్ భార్య
- మోసపోయాక పీఎస్‌లో కేసుప్రధాన నిందితుడి అరెస్ట్
- నిందితుల్లో బీఆర్ఎస్ నేత బి.వినోద్ కుమార్ బంధువు?
హనుమకొండ సిటీ, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గ్రూప్–1 ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేసిన ముఠాలో ప్రధాన నిందితుడిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు భార్య శ్రీదేవి గతేడాది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హనుమకొండలోని సుబేదారి పోలీసులు ఈ నెల 28న ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. శుక్రవారం హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. వరంగల్ పిన్నవారి వీధికి చెందిన కొత్త వీరేశం (54) సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, తనకు అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయంటూ నిరుద్యోగులకు చెప్పుకుంటూ తిరిగేవాడు. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన నల్గొండ జిల్లా మాజీ అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు భార్య వారం శ్రీదేవి దగ్గరకు వెళ్లి ఆమె కొడుకుకు గ్రూప్ –1 జాబ్ ఇప్పిస్తానని చెప్పి రూ.15 లక్షలు తీసుకున్నాడు. తర్వాత ఉద్యోగం గురించి అడిగినప్పుడల్లా వీరేశం తప్పించుకు తిరుగుతుండడంతో మోసపోయామని గుర్తించారు.
2023లో సుబేదారి పోలీస్ స్టేషన్‌లో శ్రీదేవి చీటింగ్ కేసు పెట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు.. 9 మంది నిందితులు ముఠాగా ఏర్పడి 54 మందికి జాబ్‌లు ఇప్పిస్తామని రూ.4.5 కోట్లు వసూలు చేశారని తెలుసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు కొత్త వీరేశం, అతని భార్య కొత్త అరుంధతి, వీరి కొడుకు గోపినాథ్, కూతురు పూజిత, హైదరాబాద్ నాగోల్‌కు చెందిన గూడూరు పవన్ కుమార్, అతని భార్య పద్మజ, ఖమ్మం టౌన్‌కు చెందిన ఉటూకూరి శ్రీనివాస్ రావు, ఏపీలోని ప్రకాశం జిల్లా తాల్లూరుకు చెందిన బుచ్చిబాబు, నర్సంపేటకు చెందిన బోయినపల్లి రవీందర్ రావు ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు కొత్త వీరేశంను ఈ నెల 28న అరెస్ట్ చేయగా, మిగిలిన 8 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. వీరేశం నుంచి బంగారు ఆభరణాలు, రెండు గోల్డ్ బిస్కెట్లు, రూ.71,700 నగదు, చెక్కులు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కాగా, రవీందర్ రావు తెలంగాణ ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్, బీర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ బంధువు అని తెలుస్తోంది.