ఆర్టీఏ ఆఫీసుల్లో ఏజెంట్ల పెత్తనం !

  • రిజిస్ట్రేషన్‌‌‌‌కైనా, లైసెన్స్‌‌‌‌ కావాలన్నా బ్రోకర్‌ ఉండాల్సిందే..
  • బైక్‌‌‌‌ చోరీలను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు
  • ఆర్టీఏ ఆఫీస్‌‌‌‌లకు పరుగులు తీస్తున్న వాహనదారులు
  • ఇదే అదనుగా వేలకు వేలు వసూలు చేస్తున్న ఏజెంట్లు
  • అయినా పని చేయకపోవడంతో గొడవకు దిగుతున్న జనాలు

హనుమకొండ, వెలుగు : హనుమకొండ, వరంగల్‌‌‌‌ ఆర్టీఏ ఆఫీసులు ఏజెంట్ల అడ్డాలుగా మారాయి. రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌‌‌‌ల కోసం వచ్చే జనాల నుంచి ఏజెంట్లు ఇష్టారీతిన దండుకుంటున్నారు. ఒక్కో పనికి ప్రభుత్వం నిర్దేశించిన రేటు కంటే మూడింతలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. వారు అడిగినంత ఇచ్చినా కూడా వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. 

పని పూర్తికాకముందే మొత్తం పైసలు తీసుకుంటున్న ఏజెంట్లు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారిని రోజుల తరబడి తిప్పించుకుంటుండడంతో జనాలు, ఏజెంట్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆఫీస్‌‌‌‌ల ఆవరణలోనే ఇదంతా జరుగుతున్నా ఆఫీసర్లు మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

తనిఖీలు చేస్తున్న పోలీసులు.. క్యాష్‌‌‌‌ చేసుకుంటున్న ఏజెంట్లు

గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ పరిధిలోని ఇటీవల బైక్‌‌‌‌ చోరీలు ఎక్కువయ్యాయి. దీంతో వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్‌‌‌‌ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, బైక్‌‌‌‌ పేపర్లు, లైసెన్స్‌‌‌‌లు చెక్‌‌‌‌ చేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌‌‌‌, లైసెన్స్‌‌‌‌ లేని వారంతా ఆర్టీఏ ఆఫీస్‌‌‌‌లకు పరుగులు తీస్తున్నారు. గతంలో రోజుకు 30 నుంచి 50 వరకు వచ్చే స్లాట్‌‌‌‌లు ఇప్పుడు 100 దాటుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. 

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు జనాలు ఆర్టీఏ ఆఫీస్‌‌‌‌ వద్ద క్యూ కడుతుండడంతో ఏజెంట్లు క్యాష్‌‌‌‌ చేసుకుంటున్నారు. ఒక్కో లైసెన్స్‌‌‌‌ ఇప్పించేందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు.

ఏజెంట్‌‌‌‌ ఉంటేనే పని

సలహాలు, సూచనలు ఇచ్చే వరకే పరిమితం కావాల్సిన ఏజెంట్లు ఏకంగా ఫైళ్లు పట్టుకొని ఆర్టీఏ ఆఫీసుల్లో తిరుగుతూ అన్నీ తామే అయి నడిపిస్తున్నారు. ఓ దశలో ఏజెంట్‌‌‌‌ లేనిదే ఆర్టీఏ ఆఫీస్‌‌‌‌లో పని పూర్తి కావడం కష్టమే అన్న స్థాయికి చేరింది పరిస్థితి. ఆఫీస్‌‌‌‌లోని వివిధ సెక్షన్ల ఆఫీసర్లు కూడా నేరుగా వాహనదారులు వెళ్తే పట్టించుకోవడం లేదు. రెండు రోజుల కింద ఏజెంట్‌‌‌‌ అందుబాటులో లేకపోవడంతో ఓ బైక్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ కోసం వాహనదారుడు నేరుగా కౌంటర్‌‌‌‌ వద్దకు వెళ్లి ఆఫీసర్‌‌‌‌ను కలిశాడు. 

దీంతో అక్కడి సిబ్బంది ‘మీ ఏజెంట్‌‌‌‌ ఏడి’ అని అడగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు ఏజెంట్​వచ్చే వరకు వేచి ఉండి పని పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. ఆర్టీఏ ఆఫీసుల్లో ఏజెంట్ల దందాపై పెద్దాఫీసర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఏజెంట్లకు అడ్డుకట్ట వేయాలని వాహనదారులు కోరుతున్నారు.

వరంగల్‌‌‌‌లోని శివనగర్‌‌‌‌కు చెందిన ఒకరు లైసెన్స్​ కోసం ఓ ఏజెంట్ ద్వారా వరంగల్ ఆర్టీఏ ఆఫీస్‌‌‌‌కు వెళ్లాడు. లెర్నింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ స్లాట్‌‌‌‌, ఫీజు, ఇతర చార్జీలంటూ ఏజెంట్‌‌‌‌ ఆ వ్యక్తి వద్ద రూ.4,500 తీసుకున్నాడు. పైసలు తీసుకున్నా లైసెన్స్‌‌‌‌ ఇప్పించకుండా రోజుల తరబడి తిప్పిస్తుండటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదంతా ఆర్టీఏ ఆఫీస్​ప్రాంగణంలోనే జరిగినా ఆఫీసర్లు పట్టించుకోలేదు.

హనుమకొండకు చెందిన ఓ యువకుడు డ్రైవింగ్​లైసెన్స్‌‌‌‌ కోసం ఆర్టీఏ ఆఫీస్‌‌‌‌కు వెళ్లాడు. అక్కడున్న ఓ ఏజెంట్‌‌‌‌ అతడికి లైసెన్స్ ఇప్పిస్తానని రూ. 4 వేలు తీసుకున్నాడు. అయినా పని కాకపోవడంతో మూడు రోజుల కింద ఆర్టీఏ ఆఫీస్ ప్రాంగణంలోనే గొడవకు దిగాడు.