
- బీఆర్ఎస్ టెలీ కాలర్‌ను ప్రశ్నించిన దివ్యాంగుడు
- ఈసారి బాల్క సుమన్ఇంటికేనని సమాధానం
మంచిర్యాల, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలంటూ తెలంగాణ భవన్‌నుంచి ఫోన్ చేసిన టెలీ కాలర్..అవతలి వ్యక్తి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. మంచిర్యాల జిల్లా జైపూర్మండలం ఇందారం గ్రామానికి చెందిన దివ్యాంగుడైన ఫయాజ్‌ఖాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు టెలీ కాలర్ ఫోన్‌చేసి ‘మీకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60వేలు వచ్చింది కదా. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి కేసీఆర్, బాల్క సుమన్‌ను గెలిపించండి’ అని కోరారు. దీనికి ఫయాజ్‌ఖాన్ ‘సీఎం రిలీఫ్ ఫండ్ ఏమన్నా కేసీఆర్, బాల్క సుమన్ ఇంట్లకెళ్లి ఇచ్చిర్రా?’ అని ప్రశ్నించారు.
దీనికి టెలీ కాలర్ ‘ఇలాంటి స్కీములు అమలు కావాలంటే కేసీఆర్ సర్కారు రావాలి’ అంటూ చెప్పబోయారు. ‘కేసీఆర్సర్కారు పిల్లలకు ఉద్యోగాలియ్యట్లే. మీకూ జాబ్ రాలే. మా ఊళ్లో 600కు పైగా దళిత కుటుంబాలుంటే.. బాల్క సుమన్అనుచరుడికి మాత్రమే దళితబంధు వచ్చింది.ఆయనకు ఒక్కడికే వచ్చినందుకు సంతోషపడాల్నా? మిగతావాళ్లకు రానందుకు బాధపడాల్నా?’ అని ప్రశ్నించారు. ‘బాల్క సుమన్స్థానిక నాయకులకు విలువ ఇయ్యట్లే. ఇందారం గ్రామంలో కాలిపోయి చనిపోయిన కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలే.
అక్కడ కేసీఆర్ మంత్రులను కలువడు, ఎమ్మెల్యేలను కలువడు. ఇక్కడ బాల్క సుమన్ నాయకులను కలవడు, ప్రజలను కలవడు. ఈసారి బాల్క సుమన్ ఇంటికే’ అని అన్నాడు. మీలాంటి పిల్లలకు ఉద్యోగాలు వస్తే సంతోషిస్తానని అనడంతో టెలీ కాలర్ థాంక్స్చెప్తూ ఫోన్ కట్ చేశారు. ఈ సంభాషణ తాలూకూ ఆడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.