ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దివ్యాంగులు రెండు నెలలుగా పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పెన్షన్ల కోసం వందలాది మంది ఎదురుచూస్తున్నారు. జీవో 17కు నిరసనగా దివ్యాంగులు ఆందోళనలు చేస్తున్నారు.
పింఛన్ రాక దివ్యాంగుల ఇబ్బందులు
శారీరక వైకల్యంతో ఉపాధి పనులు చేసుకోలేని వారికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,016 రూపాయల ఫించన్ ఇస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఫించన్ టైమ్ కు రాక దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి రెండు నెలల వరకు పెండింగ్ లో ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెల పెన్షన్ రాలేదని దివ్యాంగులు ధర్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 19,112 మంది, పెద్దపల్లి జిల్లాలో 12,722, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10,395 మంది, జగిత్యాల జిల్లాలో 17,103 మంది దివ్యాంగ పింఛనుదారులున్నారు. వీరిలో చాలా మందికి నెలనెలా పింఛన్లు రావడం లేదు.
దివ్యాంగుల పింఛన్ కు ఆంక్షలెందుకు
ప్రతి నెలా 7వ తేదీలోపు లబ్దిదారులకు పెన్షన్ అందాల్సి ఉంది. అయితే నెలాఖరు వరకు పెన్షన్ రాకపోవడంతో గ్రామాల్లో దివ్యాంగులు రోజూ పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో వారికి బ్యాంకుల నుంచి నగదు చెల్లిస్తున్నారు. ఇంట్లో ఫోర్ వీలర్ ఉన్నా.. మూడెకరాల భూమి ఉన్నా వికలాంగులకు పింఛన్ కట్ చేసేలా జీవో17 తీసుకురావడంపై దివ్యాంగులు మండిపడుతున్నారు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా రైతు బంధు ఇస్తున్న సర్కార్.. దివ్యాంగుల పెన్షన్ కు ఆంక్షలెందుకని ప్రశ్నిస్తున్నారు.
గ్రామాల్లో ప్రత్యేక డ్రైవులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది మంది దివ్యాంగులు ఉన్నారు. వారంతా సదరం క్యాంపులు తరుచూ నిర్వహించకపోవడం, ఒకవేళ క్యాంపులు పెట్టినా మీ సేవా సెంటర్లలో స్లాట్ బుక్ చేసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాసార్లు స్లాట్ దొరకకపోవడంతో సదరం క్యాంపు కోసం కొన్ని నెలల పాటు ఎదురుచూడాల్సి వస్తోందంటున్నారు. గ్రామాల్లో ప్రత్యేక డ్రైవులు నిర్వహించాలంటు డిమాండ్ చేస్తున్నారు. జీవో 17లోని ఆంక్షలను ఎత్తివేసి, కొత్తవాళ్లకు పెన్షన్ ఇవ్వాలని దివ్యాంగులు కోరుతున్నారు.