పెద్దపల్లి, వెలుగు: దివ్యాంగులు పింఛన్ పొందాలంటే భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోంది. మీ సేవా సెంటర్లలో స్లాట్‌బుక్ చేసుకోవడానికి నెలల తరబడి తిరుగుతున్నా బుక్ కావడం లేదు. ప్రతి నెలా స్లాట్‌బుక్ చేసుకోవాలని డీఆర్డీవో నుంచి సమాచారం రాగానే జిల్లాల్లోని మీ సేవా సెంటర్ల ముందు వందలాది మంది దివ్యాంగులు ఉదయం 6 గంటలకే చేరుకుంటున్నారు. అయితే, మొదటగా వచ్చిన ఇద్దరు, ముగ్గురివి మాత్రమే బుక్ కావడం, తర్వాత సైట్ క్లోజ్అవుతుండడంతో వారంతా తిరిగి వెళ్లిపోతున్నారు. మరుసటి నెల కూడా ఇదే తంతు. స్లాట్‌బుకింగ్ ఏడాదికి సరిపడా ఒకేసారి చేయాలని, అందులో ప్రతి నెలా టెస్ట్‌కు హాజరు కావాల్సిన వారి పేర్లు నమోదు చేసుకొని సమాచారం ఇచ్చేలా చూడాలని దివ్యాంగులు కోరుతున్నారు.
ప్రతి నెలా 200కు మించని స్లాట్ బుకింగ్ లు
దివ్యాంగులు స్లాట్ బుకింగ్‌కోసం ప్రతి నెలా మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో మీ సేవా కేంద్రంలో రెండు, మూడు స్లాట్ల కంటే ఎక్కువ బుక్ కావడం లేదు. సైట్ఓపెన్ అయిన రెండు, మూడు నిమిషాల్లోనే క్లోజ్ అవుతోంది. దివ్యాంగులు మాత్రం పొద్దున 6 గంటలకే మీ సేవా కేంద్రాలు చేరుకుంటున్నారు. కానీ, సెంటర్నిర్వాహకులు అప్పటికే కొంతమందికి మాట ఇచ్చి ఉండడంతో వారి స్లాట్లనే బుక్ చేస్తున్నారు. దీంతో మిగతా వారికి నిరాశ తప్పడం లేదు. తిరిగి మరుసటి నెల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. సుమారు ఆరు నెలల నుంచి ఏడాదిగా ఇలా ఎదురుచూసే వారున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతి నెలా స్లాట్‌బుకింగ్ 200కు మించడం లేదు. దీంతో వేలల్లో ఉన్న దివ్యాంగుల సంగతి ఏమిటో అర్థం కావడం లేదు. ఇక స్లాట్ బుక్ అయిన వారు జిల్లా దవాఖాన నుంచి హైదరాబాద్‌కు రిఫరెన్స్తీసుకొని పోతున్నారు. వారు అక్కడ ఎలిజిబిలిటీ సంపాదిస్తే సరే , లేదంటే తిరిగి మరోసారి స్లాట్‌కు ప్రయత్నించాల్సి వస్తోంది. ఈ క్రమంలో స్లాట్‌బుకింగ్ నిరంతర ప్రక్రియగా మారిపోయింది. వారు జెన్యూన్ హ్యాండిక్యాప్డ్అయితే డీఆర్డీఎ ఆఫీసులో కూడా నమోదు చేసుకుంటామని అధికారులు చెప్తున్నారు. అయితే, సదరు హ్యాండీకాప్డ్ పర్సన్ కలెక్టర్ద్వారా సర్టిఫై చేసుకున్నట్లయితే అవకాశం ఉంటుందని అంటున్నారు.
మొరాయిస్తున్న సాఫ్ట్వేర్
సదరం స్లాట్‌బుకింగ్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్చాలా సార్లు మొరాయించిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో అప్డేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నట్లు గతంలో అధికారులు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు చేసిందేమీ లేదు. ఇటీవల ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్రూ.3016 నుంచి రూ.4016 కు పెంచడంతో అర్హులైన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చాలా మంది దివ్యాంగుల కోటాలో పింఛన్లు తీసుకున్నారు. వారందరికీ సదరం సర్టిఫికెట్లు కంపల్సరీ చేయడంతో వారంతా మీసేవా సెంటర్లు, ప్రధాన దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తోంది. టెస్టులు పూర్తయిన వారికి సరైన టైంలో సదరం సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వారు పింఛన్ లాస్ అవుతున్నారు. సదరం స్లాట్ బుకింగ్ నిర్వహణలో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అవుతుండడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సులభమైన పద్ధతిలో సదరం సర్టిఫికెట్ఇచ్చి, పింఛన్అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Also Read : హైదరాబాద్లో గణనాథుల నిమజ్జనానికి.. 35 వేల మందితో బందోబస్తు
ఇతని పేరు బోనాల నాగరాజు. గత ఏడాది పక్షవాతంతో చేయి, కాలు చచ్చుబడిపోయాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భార్య, కూతురు, కొడుకుతో కలిసి ఉంటున్నాడు. ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్న ఆయన తన కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాడు. దీంతో కొడుకు చదువు మానేసి క్యాటరింగ్ పనికి పోతుండగా బిడ్డను చదివించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ కొంత ఊరట ఇస్తుందని భావించి ఆరు నెలలుగా సదరం స్లాట్‌బుక్ చేసుకోవడానికి పెద్దపల్లి, గోదావరిఖనిలోని మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నాడు. సైట్ ఓపెన్ అయిన రెండు, మూడు నిమిషాల్లోనే బంద్ అవుతుండడంతో తరచూ మీ సేవా కేంద్రానికి రావడం, పోవడమే పనిగా మారింది. సదరం స్లాట్ బుకింగ్‌కు డీఆర్డీవో నుంచి సమాచారం రాగానే మీ సేవా సెంటర్ ముందు లైన్ కడుతున్నాడు. కానీ, కొన్ని సెకన్లలోనే సైట్ క్లోజ్అవుతుండడంతో నిరాశ చెందుతున్నాడు. స్లాట్బుకింగ్ను రెగ్యులర్ చేయాలని, సైట్ నిరంతరం పనిచేసేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలని నాగరాజు కోరుతున్నాడు.
జెన్యూన్ హ్యాండీక్యాప్డ్ అయితే చేయవచ్చు
స్లాట్‌బుకింగ్ విషయంలో జెన్యూన్ హ్యాండీక్యాప్డ్ పర్సన్అయి ఉండి కలెక్టర్ ద్వారా రిఫరెన్స్పొందితే తప్పకుండా డీఆర్డీవో ఆఫీసు నుంచి సదరం స్లాట్‌బుక్ చేయొచ్చు. పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి, నడవడం కష్టంగా ఉన్నవారికి ఈ సౌకర్యం కల్పించవచ్చు. మిగతా క్యాటగిరికి చెందిన దివ్యాంగులు మీ సేవా సెంటర్ల నుంచే స్లాట్ బుక్ చేసుకోవాలి.
- శ్రీధర్, డీఆర్డీఓ, పెద్దపల్లి జిల్లా