నల్గొండ జిల్లా : చండూరు మున్సిపాలిటీ పరిధిలోని BRC ఫంక్షన్ హాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, చేనేత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నాయి. అన్ని పార్టీల నాయకులు ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో అత్యధికంగా 1.60 లక్షల మంది బీసీలే ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పద్మశాలీలు ఉన్నారు. వీరి ఓట్లు చాలా కీలకం.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు.