తెగుతున్న ఆధారం.. తెలంగాణలో పేరుకుపోయిన చేనేత వస్త్ర నిల్వలు

  •     రాష్ట్రంలో పేరుకుపోయిన చేనేత వస్త్ర నిల్వలు
  •     కొనుగోళ్లు ఆపేసిన టెస్కో
  •     ఏడియాడనే  ఉన్న రూ.100 కోట్లకు పైగా నిల్వలు
  •     చేనేత సంఘాలకు రూ.25 కోట్ల బకాయి పడ్డ టెస్కో

నల్గొండ, వెలుగు : మన చేనేత గడ్డు పరిస్థితికి దగ్గరైంది. చేనేత కోసం ఏర్పాటు చేసిన ‘టెస్కో’ (తెలంగాణ హైదరాబాద్ కో ఆపరేటివ్ సొసైటీ) ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు చేనేతకు రిజర్వు చేసిన వస్త్రాలను సైతం దర్జాగా పవర్​లూంపై నేస్తుండడంతో చేనేత వైభవం కళాహీనమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షన్నర కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయినా, చేనేతను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది.

బతుకమ్మ చీరలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలకు చేనేత వస్త్రాలను వినియోగించి చేతులు దులుపుకుందే తప్పా శాశ్వత పరిష్కారం చూపలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా చేనేత వస్త్ర నిల్వలు..మాస్టర్​వీవర్స్, చేనేత సహకార సంఘాల వద్ద పేరుకుపోయాయి. అంతేగాక టెస్కో సంస్థ.. మాస్టర్​వీవర్స్, సహకార సంఘాలకు దాదాపు రూ.25 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

తిఫ్ట్​ ఫండ్ ​బంద్

చేనేత వ్యవస్థను బాగు చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం నూలు (యారం) పై 40 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పింది. త్రిఫ్ట్​ ఫండ్​ ఇవ్వడం మానేసింది. ముడిసరుకుల ధరలు కూడా పెరిగాయి. బెంగళూరు నుంచి దిగుమతి చేసుకునే సిల్క్ ​ఖరీదు ఎక్కువగా ఉందని, ప్రభుత్వ రాయితీలు ఏమాత్ర సరిపోవడం లేదని కార్మికులంటున్నారు. యారం సబ్సిడీలో అవతవకలు జరుగుతున్నాయని జియో ట్యాగింగ్​లో నమోదైన మగ్గాలకే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. దీంతో గతంతో పోలిస్తే యాబై శాతం ఉత్పత్తులు పడిపోయాయి. చేనేత రంగం లాభసాటిగా లేదని వేల కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ ​చేస్తున్నాయి. ఇక త్రిఫ్ట్ ​ఫండ్ (పొదుపు పథకం)​ కింద 50 శాతం సంఘాలు చెల్లిస్తే, మరో 50 శాతం సంఘాల ఖాతాల్లో జమ చేస్తామని గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం మాటిచ్చినా నిలబెట్టుకోలేదు.  

సంక్షోభంలో చేనేత పరిశ్రమ...

పవర్​లూమ్స్​, హ్యాండ్లూమ్స్​కు మధ్య పోటీ ఉండేది. కానీ, ఇప్పుడు రెండూ సంక్షోభంలోనే ఉన్నాయి. నూలు ధర పెరిగిపోవడంతో మాస్టర్​వీవర్స్​పైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఇక్కడ తయారయ్యే పంచలు, టవల్స్, లుంగీలు వంటి రకాలు అన్నీ తమిళనాడు నుంచి దిగుమతి చేస్తున్నారని, దీని వల్ల స్థానిక పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని సహకార సంఘాలంటున్నాయి. రాష్ట్రంలో 50 వేలకు పైగా పవర్​లూమ్స్​ పనిచేస్తున్నాయనేది ఒక అంచనా. చట్ట ప్రకారం పవర్​లూమ్స్​పై 21 రకాల వస్త్రాలు మాత్రమే తయారు చేయాలి. అది కూడా తెల్లని వస్త్రం మాత్రమే . కానీ, పోచంపల్లి పట్టు డిజైన్​ను కాపీ చేసి పవర్​లూం మీద తయారు చేసి తక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీంతో చేనేత కార్మికుడు పవర్​లూంతో పోటీ పడలేకపోతున్నాడు. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం రంగులు, రసాయనాల పైనా జీఎస్టీ వేస్తోంది. నూలు మీద 12 శాతం, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ విధిస్తుండడంతో బట్టకు ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తోంది. మరోవైపు రేట్లు పెంచితే కొనేందుకు కస్టమర్లు ముందుకు రావడం లేదు.

కనుమరుగవుతున్న సొసైటీలు

రాష్ట్రంలో చివరగా 2013లో చేనేత సంఘాలకు ఎన్నికలు జరిగాయి. తర్వాత ఐదేండ్లకోసారి రెన్యువల్​ చేస్తున్నారే తప్పా ఎన్నికలు నిర్వహించలేదు. పర్సన్​ఇన్ చార్జీలను నియమించి సంఘాల కాల పరిమితి పొడిగిస్తున్నారు. ఇప్పటికే 9 సార్లు పొడిగించడం వల్ల సహకార సంఘాల ఉనికి ప్రమాదంలో పడిపోయింది. రాష్ట్రంలో ఒకప్పుడు 5 వందలకు పైగా సొసైటీలుండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోవడంతో వాటి సంఖ్య మూడొందలకు చేరింది. ఈ సంఘాల్లో లక్షకు పైగా సభ్యులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. 

టెస్కో డబ్బులు ఇవ్వకపోవడంతోనే...

సొసైటీల నుంచి కొన్న వస్త్రాలకు టెస్కో పేమెంట్​ చేయడానికి ఆరు నెలల నుంచి ఏడాది పట్టేది. దీంతో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న సొసైటీలను రుణాల భారం వేధించేది. ఇప్పడు కూడా ఏడాదిగా టెస్కో పేమెంట్​చేయకపోవడంతో సహకార సంఘాల్లో పనిచేస్తున్న సభ్యులు ఉపాధి కోల్పోయి చివరకు మాస్టర్​వీవర్స్​ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. చేనేత కుటుంబం ఒకరోజు మొత్తం కష్టపడి పనిచేసినా...మాస్టర్ వీవర్స్​ నుంచి నాలుగు, ఐదొందలకు మించి గిట్టుబాటు కావట్లేదు. మాస్టర్​ వీవర్స్​ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలను టెస్కో ఎప్పటికప్పుడు కొని ఇన్​టైంలో డబ్బులు చెల్లిచాలని సహకార సంఘాల ప్రతినిధులు డిమాండ్​ చేస్తున్నారు. 

వడ్ల కొనుగోలు కేంద్రాల తరహాలో చేనేత వస్త్రాలు కొనాలి 

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినట్లే చేనేత వస్త్రాలు కూడా కొనాలి. త్రిఫ్ట్​ ఫండ్, చేనేత మిత్ర పథకాలకు నిధులు విడుదల చేయాలి. ప్రభుత్వ సిబ్బంది యూనిఫామ్​లు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు అందజేసి చేనేత కార్మికులకు పని కల్పించాలి. కార్మికులకు వర్క్ షెడ్ తో కూడిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి,  చేనేత సహకార సంఘాలకు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలి. 80 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల లోన్లు ఇవ్వాలి. 

-గంజి మురళీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ చేనేత కార్మిక సంఘం