
కొడిమ్యాల, వెలుగు : అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోగా.. తననే ఇబ్బందులు పెడుతున్నారన్న మనస్తాపంతో ఓ చేనేత కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో జరిగింది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కొడిమ్యాలకు చెందిన రాచర్ల ప్రకాశ్ (54) సిరిసిల్లలో చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతడు కొందరు వ్యక్తులకు అప్పు ఇచ్చాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కొన్ని రోజులుగా అడుగుతున్నా.. వారు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఓ వైపు అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడం.. మరో వైపు తాను అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేస్తుండడంతో మనస్తాపానికి గురైన ప్రకాశ్ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం అతడి భార్య రాధ గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.