బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న నేతకారుల శ్రమకు తగిన విలువ దక్కడం లేదు. చితికిపోతున్న నేత పరిశ్రమతో ఆత్మహత్యలతో అట్టుడికిపోతున్న కాలంలో సిరిసిల్ల నేతన్నలకు ‘బతుకమ్మ చీరలు’ ఆశాకిరణంగా అందివచ్చాయి. చేతినిండా పనితో తిండికి ఢోకా లేకుండా సాగుతున్నా, పెరిగిన జీవన వ్యయానికి సమానంగా కూలి రేట్లు పెరగకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్టుతో యాజమాన్యాలు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే.. నేత కళాకారుల పనితనం మాత్రం వెలవెలబోతున్నది. ఏటా కొత్త డిజైన్లతో చీరల పని భారం పెరుగుతున్నా, కూలి రేట్లలో మార్పు లేక నేతకారుడు చితికిపోతున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా చేనేత, మరమగ్గాల కార్మికుల జీవనోపాధి కుంటుబడిపోగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో మొక్కుబడి కేటాయింపులు చేయడంతో చేనేత రంగం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
కూలి పెంపుపై ఎన్నాళ్లుగానో డిమాండ్లు
వస్త్ర పరిశ్రమలో పనిచేసే కార్మికులు, అనుబంధ రంగాల కార్మికుల కూలి పెంపుపై ఎన్నో రోజులుగా డిమాండ్లు ఉన్నాయి. పాలిస్టర్ కార్మికుల కూలి పెంపు గడువు నెల క్రితమే ముగిసింది. పాలిస్టర్ 10 పిక్కుల పెద్ద పన్నకు 25 పైసలు చెల్లిస్తుండగా ప్రస్తుతం 35 పైసలు.. చిన్న పన్నకు 22 పైసలు చెల్లిస్తుండగా 30 పైసలు ఇవ్వాలని, పాలిస్టర్ వార్పిన్ కూలి వెయ్యి భీము పోగులకు 40 పైసలు, వైపని కార్మికులకు వెయ్యి పోగులకు రూ.110 ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇందుకు యాజమాన్యాలు సిద్ధంగా లేవు. ఇదిలా ఉండగా, టెక్స్ టైల్ పార్క్ లోని కార్మికుల కూలి ఒప్పందం గడవు ముగిసి రెండున్నరేండ్లు గడుస్తున్నా, పెంపుపై యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం మీటర్ నేతకు 31 పైసలు చెల్లిస్తుండగా, దీన్ని 45 పైసలకు పెంచాలని, వార్పిన్ కు సంబంధించి మీటర్కు 45 పైసలు పెంచాలన్న డిమాండ్ను అంగీకరించడం లేదు. కాటన్ నేత కార్మికుల కూలి ఒప్పందం ముగిసి పది నెలలు అవుతున్నా, కూలి రేటును సమీక్షంచడంలో మేనేజ్మెంట్లు వెనుకంజ వేస్తున్నాయి. ప్రస్తుతమున్న 10 పిక్కులకు 40 పైసలను 55 పైసలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
యజమానుల గుప్పిట్లో సంఘాలు
సిరిసిల్లలో 136 మ్యాక్స్ సంఘాలు, 138 చిన్నతరహా పరిశ్రమలను (ఎన్ఎస్ఏ) ఆసాములు ఏర్పాటు చేసుకున్నారు. ఆసాముల వద్ద పెట్టుబడులు లేకపోవడంతో యజమానుల పెట్టుబడితో ఒక్కొక్కరు 20 సంఘాలను గుప్పిట్లో ఉంచుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. ముడిసరకును అందిస్తూ, తయారు చేసిన గుడ్డను టెస్కోకు అందజేస్తూ ఏటా రూ.3 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. దీంతో కార్మికులు, ఆసాముల సంక్షేమానికి నిర్దేశించిన బతుకమ్మ చీరల ఆర్డర్ యాజమాన్యాలకు వరంగా మారింది. 2017లో రూ.225 కోట్లతో 90 లక్షలు, 2018లో రూ.290 కోట్లతో 98 లక్షలు, 2019లో రూ.320 కోట్లు, 2020లో రూ.330 కోట్లు వెచ్చించి కోటి బతుకమ్మ చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. ఈ ఏడాది రూ.350 కోట్లతో కోటి బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చింది. చీరల ఉత్పత్తిలో టెస్కో మీటరుకు రూ.33 చొప్పున కొనుగోలు చేస్తుంది. దీనిలో ఆసామికి, కార్మికులకు కలిపి రూ.9.50 చెల్లిస్తారు. డాబీ, జకాట్ డిజైన్లు రాకముందు రూ.8.50 చెల్లించేవారు. మిగిలిన రూ.23.50 యజమాని నూలు కొనుగోలు, వార్పిన్, వైపని, రవాణా ఖర్చులకు తీసుకుంటారు. ఇక కార్మికుడికి రూ.4.50 చెల్లింపులతో అదనంగా ప్రభుత్వం 10 శాతం నూలు రాయితీ కింద రూ.1.45 చెల్లిస్తుంది. ప్రస్తుతం మారిన డిజైన్లతో ఆసామి ఒక్కో మరమగ్గాన్ని రూ.15 వేలతో ఆధునీకరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మీటరుకు చెల్లించే రూ.4.25 పెట్టుబడి ఖర్చులకే సరిపోదు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆధునికీకరించిన మరమగ్గంపై 4,800 మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇస్తోంది. ఇలా ఉత్పత్తి చేసిన చీరలకు మీటరుకు పది శాతం నూలు రాయితీలో రూ.1.50 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇలా ఏడాదికి రూ.7,200 చొప్పున రెండేండ్లు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. కానీ దీనిపై టెస్కో నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.
ఈ పెంపు సరిపోదు
మరమగ్గాల చప్పుళ్లతో నిత్యం సందడిగా ఉండే సిరిసిల్ల కార్మికక్షేత్రం సమ్మె కారణంగా తొమ్మిది రోజులుగా నిశ్శబ్దాన్ని అలుముకుంది. నూలు ధర పెరగడంతో యజమానులకు, మరమగ్గాల ఆధునీకరణతో ఆసాములకు, డిజైన్ల మార్పుతో కార్మికులకు శ్రమ భారం పెరిగింది. ఉత్పత్తి చేసిన చీరల కొనుగోలు ధరకు, పెట్టుబడికి మధ్య భారీగా వ్యత్యాసం నెలకొంది. జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేల మరమగ్గాలపై బతుకమ్మ చీరలు, మరో 20 వేల మగ్గాలపై ప్రైవేటు ఆర్డర్ల ఉత్పత్తి జరుగుతున్నది. సమ్మె కారణంగా రోజుకు సగటున ఆసామి వెయ్యి రూపాయలు, కార్మికుడు రూ.400 నష్టపోయారు. అయితే రెండుమూడు రోజులుగా అధికారులు, కార్మిక సంఘాలతో జరుగుతున్న చర్చలు బుధవారం కొలిక్కి వచ్చాయి. పది రోజుల సమ్మె అనంతరం బతుకమ్మ చీరల డాజీ, డిజైన్ ఉత్పత్తి 40 కొలల కింద ఉత్పత్తి చేసిన మీటర్కు ఆసామికి రూ.10.50, కార్మికునికి రూ.5.. అలాగే 40 కొలల పైన ఉత్పత్తి చేసిన డిజైన్లకు ఆసామికి రూ.11, కార్మికులకు రూ.5.25 ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అయితే పెరిగిన నిత్యావసరాల కారణంగా ఈ పెంపు కూడా తక్కువే. నేతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని వారి సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
25 వేల మందికి ఆధారం
సిరిసిల్ల పట్టణంలో సుమారు 30 వేలకు పైగా మరమగ్గాలు ఉండగా, 25 వేల మరమగ్గాల పై పాలిస్టర్, మిగిలినవాటిపై కాటన్ వస్త్రం తయారవుతుంది. వీటిపై సుమారు 25 వేల మంది కార్మి కులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల తయారీతో చేతినిండా పని దొరికినా, 2017లో నిర్ణయించిన కూలీ రేటునే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కూలి రేటు పెంచకపోగా, బతుకమ్మ చీరల కొత్త డిజైన్లు పింజర్లు, డాబీలు అమర్చడంతో వారిపై విపరీతమైన భారం పెరిగింది. ఒక్కో కార్మికుడు గతంలో 8 మరమగ్గాలను నడుపగా, ప్రస్తుతం నాలుగు కూడా నడిపే పరిస్థితి లేదు. దీంతో సంపాదనలో కోత పడటంతో, కూలి రేట్ల పెంపు కోసం సమ్మెకు దిగక తప్పలేదు. బతుకమ్మ చీరల ఉత్పత్తికి ప్రస్తుతం మీటర్కు చెల్లిస్తున్న రూ.4.75ను మరింత పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, ప్రభుత్వం బతుకమ్మ చీర మీటర్కు రూ.33 చెల్లిస్తుండగా, ఈ రేటును పెంచాలని యజమానులు కోరుతున్నారు.-కోడం పవన్ కుమార్,సీనియర్ జర్నలిస్ట్.