- 2 నెలల ముందే ఇంట్లో బాంబు పెట్టిన దుండగులు
న్యూఢిల్లీ: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా (62)హత్యకు సంబంధించి సంచలన విష యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన మిసైల్స్ దాడిలో హనియా చనిపోలేదని.. ఆయన ఉన్న ఇంట్లో రెండు నెలల కిందట ఫిక్స్ చేసిన బాంబు పేలుడు వల్లే హనియా ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తున్నది. ఈ మేరకు యూఎస్, మిడిల్ ఈస్ట్‌కు చెందిన ఆఫీసర్లు ఇచ్చిన సమాచారంతో ది న్యూయార్క్ టైమ్స్ ఓ రిపోర్ట్ ను ప్రచురించింది. పక్కా ప్లాన్ తోనే హనియా హత్య జరిగిందని నివేదిక వెల్లడించింది.
ఇందుకోసం రెండు నెలల ముందే ఇరాన్‌లోని ఆయన గెస్ట్‌హౌస్‌లో దుండగులు బాంబు పెట్టినట్లు తెలిపింది. ఈ గెస్ట్‌హౌస్ టెహ్రాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ)కి చెందిన ఓ పెద్ద భవన సముదాయంలో ఉందని తెలిపింది. ఇందులో ఐఆర్జీసీ సీక్రేట్ మీటింగ్స్ నిర్వహించడంతోపాటు ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉపయోగిస్తుందని వివరించింది. నిత్యం ఐఆర్జీసీ బలగాలు పహారా కాసే ఈ గెస్ట్‌హౌస్ కు హనియా వస్తాడని ముందే తెలుసుకున్న దుండగులు..అక్కడ దాదాపు రెండు నెలల కిందటే బాంబును పెట్టినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.