అధ్వానంగా హనుమకొండ బస్టాండ్‌‌‌‌‌‌‌‌

అధ్వానంగా హనుమకొండ బస్టాండ్‌‌‌‌‌‌‌‌
  •  డ్రైనేజీ, వరద నీటితో కంపుకొడుతున్న పరిసరాలు
  • ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా పెరగని సౌకర్యాలు
  • ఇరుకు, గుంతలతో అస్తవ్యస్తంగా మారిన బస్టాండ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు
  • గత సర్కార్‌‌‌‌‌‌‌‌ పట్టించుకోకపోవడంతో  వెనక్కు పోయిన స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌

వరంగల్‍, వెలుగు : గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని హనుమకొండ సిటీ బస్టాండ్‍ డేంజర్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌లో పడింది. దీనిని ప్రారంభించి ఇప్పటికే యాభై ఏండ్లు పూర్తి అయింది. బస్టాండ్‌‌‌‌‌‌‌‌ ఏరియా చుట్టుపక్కల ఉండే హోటళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు, వానాకాలంలో వచ్చే వరదతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండగా, చుట్టూ ఉన్న మోరీలు ప్రమాదకరంగా మారాయి. బస్టాండ్‌‌‌‌‌‌‌‌లోకి బస్సులు వచ్చే రోడ్డు ఇరుకుగా ఉండడమే కాకుండా అడుగుకో గుంత దర్శనమిస్తోంది.

 ఈ రోడ్డును ఆనుకునే ఓపెన్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీలు ఉండడంతో చిన్నపాటి వాన వచ్చినా రోడ్డేదో.. డ్రైనేజీ ఏదో తెలియని పరిస్థితి నెలకొంది. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కింద కొత్త బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి అవకాశం వచ్చినా అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ వెనక్కు పోయింది.

యాభై ఏండ్ల కింద నిర్మాణం

జిల్లాకు చెందిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ మాజీ ఎంపీ ఎండీ.కమాలుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్టీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. ఆ టైంలో హనుమకొండలో కొత్త బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుత జవహర్‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌ నెహ్రూ స్టేడియం పక్కన ఉన్న 12 ఎకరాల తాటివనంలో బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారు. 1970 – 71 టైంలో బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం ప్రారంభం కాగా, 1974 మార్చి 14న అప్పటి సీఎం జలగం వెంగళ్‌‌‌‌‌‌‌‌రావు ముఖ్య అతిథిగా హాజరై బస్టాండ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి నెలతో ఈ బస్టాండ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించి 50 ఏండ్లు దాటింది.

రోడ్డు వెడల్పును పట్టించుకోని లీడర్లు

హనుమకొండ సిటీ బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాతో పాటు తిరుపతి, బెంగళూర్‍, షిర్డి వంటి ప్రాంతాలకూ బస్సులు నడుస్తుంటాయి. ఈ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లోకి బస్సులు వచ్చే దారిలో కేడీసీ నుంచి జవహర్‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌ స్టేడియం వరకు 300 మీటర్ల రోడ్డు ఇరుకుగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఏండ్ల తరబడి ఉన్న ఈ సమస్య తమ దృష్టికి వచ్చినప్పటికీ గత ప్రభుత్వ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. 

వానాకాలం కావడంతో ప్రస్తుతం ఈ రోడ్డుపై ఫీట్‌‌‌‌‌‌‌‌లోతు గుంతలు ఏర్పడి డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ కూడా చేయలేని దుస్థితి ఏర్పడింది. రోడ్డును ఆనుకునే ఓపెన్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ ఉండడంతో ఎంతో మంది ప్రయాణికులు అందులో పడి గాయాలపాలయ్యారు. ఏషియన్‍ మాల్‌‌‌‌‌‌‌‌ వైపు జంక్షన్ల ముస్తాబు పేరుతో రోడ్డు మొత్తాన్ని ఆక్రమించడంతో రోడ్డు మొత్తం ఇరుకుగా మారింది.

వెనక్కు పోయిన స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌

వరంగల్‌‌‌‌‌‌‌‌ నగరం 2016లో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైంది. రూ. 620 కోట్లతో బస్‌‌‌‌‌‌‌‌ టర్మినల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ చేపట్టాలని కేంద్రం ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. పీపీఈ పద్ధతిలో మరో రూ.375 కోట్లతో పార్కింగ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కమర్షియల్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ నిర్మించేలా మొత్తం రూ.995 కోట్లతో ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ చేసింది. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ పనుల్లోనూ బస్టాండ్‌‌‌‌‌‌‌‌ రీడెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు రూ.100 కోట్లు కేటాయించారు. 

అయితే చేసిన పనులకు సంబంధించిన లెక్కలను గత సర్కార్‌‌‌‌‌‌‌‌ కేంద్రానికి పంపించలేదు. దీంతో కొన్ని ప్రాజెక్టులను తొలగించాల్సి వచ్చింది. అయితే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో స్మా్ర్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ పనుల లిస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి హనుమకొండ బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాన్ని తొలగించాల్సి వచ్చింది.

హోటల్స్‌‌‌‌‌‌‌‌ మురుగంతా బస్టాండ్‌‌‌‌‌‌‌‌లోకే...

హనుమకొండ సిటీ బస్టాండ్‌‌‌‌‌‌‌‌ విశాలంగానే ఉన్నప్పటికీ అడుగడుగునా గుంతలే కనిపిస్తున్నాయి. యాభై ఏండ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం బస్సులు, ప్యాసింజర్లు విపరీతంగా పెరిగినా, అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు కనిపించడం లేవు. బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ చాలా చోట్ల శిథిలావస్థకు చేరుకుంది. టీఎస్‌‌‌‌‌‌‌‌ ఆర్టీసీతో పాటు అద్దె బస్సులు పెరగడంతో పార్కింగ్‍, ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారాల ఇబ్బంది ఏర్పడుతోంది. 

ప్రయాణికులు కూర్చునేందుకు సీటింగ్‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ కూడా సరిగా లేదు. బస్టాండ్‍ చుట్టూ ఉన్న హోటల్స్‌‌‌‌‌‌‌‌, లాడ్జీలు, హస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ ఎత్తులో కట్టడంతో కొద్దిపాటి వాన కురిసినా ఆ వరద నీటితో పాటు, హోటళ్లు, లాడ్జీల నుంచి వచ్చే మురుగు నీరంతా బస్టాండ్‌‌‌‌‌‌‌‌లోకి చేరుతోంది. పరిసరాలు క్లీన్‌‌‌‌‌‌‌‌గా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.