హనుమకొండ సిటీ, వెలుగు: ‘గవర్నమెంట్ డ్యూటీ’ స్టిక్కర్ వేసుకున్న కారుతో గుట్కా దందా చేస్తున్న వ్యక్తిని హనుమకొండ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.7.20లక్షల విలువైన గుట్కా, అంబర్ తదితర పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను హనుమకొండ పీఎస్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. హనుమకొండ పెద్దమ్మగడ్డ హనుమాన్ నగర్‌కు చెందిన జంగం సురేశ్గుట్కా దందాకు తెరలేపాడు. వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు గుట్కా కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతూ ఇల్లీగల్బిజినెస్చేస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన ఫ్రెండ్కారుకు ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అనే స్టిక్కర్ వేయించాడు.
అదే కారులో వివిధ ప్రాంతాల నుంచి గుట్కా సరఫరా చేస్తూ.. దందా సాగిస్తున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ పోలీసులకు సమాచారం అందగా.. సీఐ సీహెచ్ శ్రీనివాస్ జీ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం జంగం సురేశ్ఇంటి వద్ద నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ శ్రీనివాస్ జీ, ఇతర సిబ్బందిని డీసీపీ అశోక్ కుమార్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సొమ్ము చేసుకునే వారిని ఎట్టి పరిస్థితిల్లో ఉపేక్షించేది లేదని డీసీపీ హెచ్చరించారు. అనంతరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
పిన్నవారి వీధిలో..
కాజీపేట, వెలుగు: వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధి పిన్నవారి వీధిలో రూ.36 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీమాబాద్ ప్రాంతానికి చెందిన మాశెట్టి నర్సింహమూర్తి అనే వ్యక్తి, పిన్నవారి వీధిలోని తన దుకాణంలో పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్నాడనే సమాచారం వచ్చింది. దీంతో దాడులు నిర్వహించి, గుట్కాను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సీఐలు వెంకటేశ్వర్లు, నరేశ్‌కుమార్, ఎస్సైలు లవన్ కుమార్ తదితరులున్నారు.