
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ ధూంధాంగా సాగింది. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్.. రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ..’ నినాదాలతో సిటీ హోరెత్తింది. గౌలిగూడ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్ నగర్, కవాడిగూడ, బైబిల్ హౌస్ మీదుగా సాగి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వద్ద ముగిసింది. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన 190 యాత్రలు ప్రధాన శోభాయాత్రలో కలిశాయి.
ప్రముఖ స్వామీజీ, విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకుడు రామ్ విలాస్ దాస్ వేదాంతి సీపీ ఆనంద్‌తో కలిసి గౌలిగూడ హనుమాన్ మందిర్ వద్ద శోభాయాత్రను ప్రారంభించారు. సిటీ సీపీ సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్త్‌ను పర్యవేక్షించారు.
అలాగే ప్రసిద్ధ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఐపీఎల్ మ్యాచ్ కోసం సిటీకి వచ్చిన సినీ నటి, పంజాబ్ టీమ్ యజమాని ప్రీతి జింటా తాడ్‌బండ్ శ్రీవీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.