భారత క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి మనస్సు మార్చుకున్నాడు. ఆంధ్రా జట్టు నుండి వైదొలగాలని తన నిర్ణయాన్ని విడనాడాడు. రాబోయే దేశవాళీ సీజన్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
కాగా, విహారి సరిగ్గా ఐదు నెలల క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ) ప్రభుత్వంలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పెద్దలతో గొడవ పడి.. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఆడనని శపథం చేశాడు. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించిందని, అవమానించిందని, ఇకపై వారి తరఫున ఆడనని ఈ 30 ఏళ్ల క్రికెటర్ ప్రతిజ్ఞ చేశాడు.
ఇప్పుటి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గల టీడీపీ ప్రభుత్వంపై విహారి సానుకూలంగా స్పందించాడు. తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి సహాయపడిన రాష్ట్రం తరపున ఆడే అవకాశం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు.
"నేను భారతదేశం తరపున, ఆంధ్రా తరపున ఆడాను. కావున రాష్ట్ర క్రికెట్‌పై నా నిబద్ధత బలంగా ఉంది. నా తొలి నిర్ణయానికి నిష్క్రమించడానికి అనేక కారణాలు ఉన్నాయి. నన్ను నేను కొనసాగడానికి ఒప్పించాను. ఆంధ్రా తరపున ఆడటం నాకు సంతోషంగా ఉంది. కెప్టెన్సీ ఇస్తే రాష్ట్రానికి నాయకత్వం వహించడం ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇటీవలి ఎన్నికలు, ప్రభుత్వ మార్పు తర్వాత లోకేష్ నన్ను కొనసాగాలని అభ్యర్థించారు. నేను ఆంధ్రా కోసం ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని విహారి క్రిక్ బజ్ తో అన్నారు.
విహారి ఆంధ్రా తరపున 37 గేమ్‌లు ఆడాడు. అతను రాజీనామా చేయడానికి ముందు వాటన్నింటిలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
అప్పుడేం జరిగింది..?
ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌తో ఆంధ్రా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత, ఆంధ్ర క్రికెట్‌లో రాజకీయ జోక్యాన్ని ప్రాథమిక కారణంగా పేర్కొంటూ విహారి తాను రాష్ట్రం నుండి నిష్క్రమిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్ నుంచి తప్పించిందని పేర్కొన్నాడు. రంజీ మ్యాచ్‌లో భాగంగా ఒక రాజకీయ నాయకుడి కుమారుడిపై అరవడం వల్లే ఈ చర్యలు తీసుకున్నారని ఈ క్రికెటర్ అప్పట్లో ఆరోపించాడు.
"నేను ఆ ఆటగాడిపై ఎప్పుడూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అయినప్పటికీ, 16 సంవత్సరాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడంతోపాటు, సంవత్సరాలుగా ఆంధ్రా క్రికెట్ విజయానికి నా సహకారం ఉంది. అలాంటిది ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు నాకు ఇబ్బందిగా అనిపించాయి. కానీ, ఆటపై నాకున్న గౌరవంతో ఈ సీజన్‌లో ఆడటం కొనసాగించాను."
"బాధాకరం ఏంటంటే.. ఆటగాళ్లు ఏం చెప్పినా వినాలని, వాళ్ల వల్లే ప్లేయర్ ఉన్నారని అసోసియేషన్ భావిస్తోంది. అవమానంగా, ఇబ్బందిగా అనిపించింది కానీ, ఈ రోజు వరకు ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఆంధ్రా తరఫున ఆడకూడదని నిర్ణయించుకున్నాను. నేను నా ఆత్మగౌరవాన్ని కోల్పోయాను.." అని విహారి సోషల్ మీడియా పోస్టుతో అగ్గి పుట్టించాడు.
Ranji Trophy 2023/24 pic.twitter.com/PXHNG487BQ
— Hanuma vihari (@Hanumavihari) February 26, 2024
ఆ ప్రకటన రాజకీయ తుఫానుకు దారితీసింది. ప్రతిపక్ష టీడీపీకి చెందిన నాయకులు విహారికి జరిగిన అన్యాయాన్ని ఖండించారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, చంద్రబాబు కుమారుడు లోకేష్ నాయుడు వెంటనే విహారికి సంఘీభావం తెలిపారు.
కాగా, ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆఫీస్ బేరర్లందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు.