తాజాగా వరంగల్ బస్టాండ్ డెవలప్మెంట్కు రూ.75 కోట్లతో ప్లాన్
- 'స్మార్ట్ సిటీ'లో చేర్చి రివ్యూలతో హడావుడి చేసిన లీడర్లు, ఆఫీసర్లు
- చివరకు స్కీంలో దక్కని అవకాశం
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణాకు కేంద్రం హనుమకొండ బస్టాండ్. ఇక్కడి నుంచే చుట్టుపక్కల జిల్లాలతోపాటు, ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్తుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే హనుమకొండ బస్టాండ్ అతి పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం 1,500కు పైగా బస్సులు, లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ, ఈ బస్టాండ్‌ను ‘స్మార్ట్ బస్ టెర్మినల్’ గా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా డెవలప్ చేస్తామని గతంలో రివ్యూలతో హడావుడి చేసిన లీడర్లు ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇదిలా ఉండగా.. మొన్నటికి మొన్న తెరమీదకు వచ్చిన వరంగల్ బస్ టర్మినల్ కు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే డిజైన్ ఫైనల్ కాగా రూ.75 కోట్లతో పనులు షురూ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
పట్టించుకోని లీడర్లు..
ఉమ్మడి జిల్లాలో హనుమకొండ బస్టాండ్ నుంచే సంస్థకు ఆదాయం ఎక్కువ ఉంది. దీంతో ఈ బస్టాండ్‌ను మరింత డెవలప్ చేయాలని గతంలో అధికారులు భావించారు. ఆర్టీసీ ఆఫీసర్లు అప్పట్లో ప్రణాళికలు కూడా రెడీ చేసి, రూ.100 కోట్ల వరకు ఖర్చు అంచనా వేశారు. బస్టాండ్లు, డిపోలు మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. 60 ప్లాట్ ఫామ్‌లతో సుమారు 5 ఎకరాల్లో ఈ టెర్మినల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిజిటల్ స్క్రీన్లు, ఇంటర్ నెట్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, ఏటీఎం సెంటర్లు, హోటళ్లు తదితర సేవలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. దానివల్ల ప్రయాణికులకు మేలు జరగడంతో పాటు ఆర్టీసీకి కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని భావించారు. కానీ ఆ తరువాత దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో స్మార్ట్ సిటీ నుంచి
తొలగించారు.
5 అంతస్తులు.. రూ.75 కోట్లతో వరంగల్ బస్టాండ్..
వరంగల్ బస్టాండ్‌ను డెవలప్ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ, కుడా, జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. రూ.75 కోట్ల అంచనాతో పనులకు ఓకే చెప్పింది ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను కూల్చేసి పక్కనే ఉన్న జీడబ్ల్యూఎంసీ, కుడా స్థలాలను కలిపి 2.32 ఎకరాల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ టర్మినల్లో ఐదు అంతస్తులు, 32 ప్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేయనున్నారు. సెల్లార్లు, కమర్షియల్ షెట్టర్స్, రెస్టారెంట్స్, డిజిటల్ స్క్రీన్స్, ఎస్కలేటర్స్ ప్లాన్ చేస్తున్నారు. నగరంలో మెట్రో నియో రైలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో దానికి ఇంటర్ కనెక్ట్ చేయడంతో పాటు పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ వరకు బస్ టర్మినల్ నుంచి స్కై వాక్ నిర్మించనున్నారు. దీనికోసం కిందటి నెలలో బస్ భవన్ లో ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్, ఎండీ సజ్జనార్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఆర్టీసీ ఆఫీసర్లు బస్టాండ్ ప్లాన్ పై చర్చించారు. తొందర్లోనే పనులు స్టార్ట్ చేసే అవకాశం ఉందని కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ చెబుతున్నారు.
ప్లాట్ ఫామ్స్ సాల్తలేవు
హనుమకొండలో ఉన్న పాత బస్టాండ్ ను 1974లో అప్పటి అవసరాలకు అనుగుణంగా 9 ప్లాట్ ఫాంలతో నిర్మించారు. దాదాపు వందేళ్ల జీవితకాల అంచనాతో నిర్మించగా.. ఇప్పటికే కొన్నిచోట్ల పెచ్చులూడుతున్నాయి. దాని పక్కనే 1990లో కొత్తగా సిటీ బస్టాండ్ ను 12 ప్లాట్ ఫాంలతో నిర్మించారు. కానీ రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ప్లాట్ ఫామ్స్ సరిపోవడం లేదు. సరిపడా పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. ఇప్పటికైనా హనుమకొండ బస్ టెర్మినల్ ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని ప్రయాణికులు, ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.