అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య

ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు: ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ‌హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కుడా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిని కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాపును పరిశీలించి, మాట్లాడుతూ జంక్షన్ నిర్మాణం, సుందరీకరణ పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని, మిగతా పనులను పది రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బస్టాండ్, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను కలెక్టర్ పరిశీలించారు. 

అనంతరం ఎల్కతుర్తి నుంచి మెదక్​వరకు నిర్మిస్తున్న హైవే పనుల్లో భాగంగా ముల్కనూర్​ బస్టాండ్​ వద్ద చేపట్టిన పనులను కలెక్టర్​ పరిశీలించారు. రహదారి పక్కనే ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించి, రోడ్డు పక్కనే కొద్ది అడుగుల దూరంలోనే ఉన్న బస్టాండ్ కార్నర్ స్థలానికి అంబేద్కర్ విగ్రహాన్ని మార్చాలన్నారు. ముల్కనూర్​లోని  గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.