
హనుమకొండ, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దని, ఆ దిశగా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో శుక్రవారం ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డితో కలిసి మున్సిపల్, కుడా, జిల్లా పంచాయతీ, ఇతర శాఖల అధికారులతో రివ్యూ చేశారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు మున్సిపల్ పరిధిలోని వార్డు ఆఫీసుల్లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు. వాటిద్వారా పేమెంట్లపై ప్రచారం జరగాలన్నారు. కుడా పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఎంపీవోలు చర్యలు చేపట్టాలని, పేమెంట్ జరిగిన రెండు రోజుల్లో ఎల్-1 దశ నుంచి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్, పరకాల మున్సిపాలిటీతోపాటు ఇతర గ్రామాల్లో తాగునీటి సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ మల్లేశం, కుడా పీవో అజిత్ రెడ్డి, గ్రేటర్ సీపీవో రవీందర్ రాడేకర్, డీఎల్పీవో గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.