
హనుమకొండ/ హనుమకొండ సిటీ, వెలుగు: భద్రకాళి చెరువు పూడికతీత మట్టిని ఇటుక బట్టీల యజమానులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కోరారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ లో భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపు, తదితర అంశాలపై గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే, హనుమకొండ, వరంగల్ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణితో కలిసి సమావేశం నిర్వహించారు.
సాగునీటిపారుదల శాఖ ఈఈ శంకర్ మాట్లాడుతూ చెరువు పూడికతీత మట్టిలో ఇప్పటివరకు 4లక్షల 60వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకువెళ్లేందుకు దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 28 వరకు గడువు ఉన్నందున మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ చెరువు మట్టి తీసుకవెళ్లేందుకు అప్రోచ్ రోడ్డులు ఉండాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఆఫీసర్లు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై అధికారులతో మీటింగ్ నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో 55 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 39,980 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. సెంటర్లలో సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం దామెర మండలం ల్యాదెల్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న పరకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుపై కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఆర్డీఏ, వీ-హబ్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్షించారు. మహిళా సాధికారత దిశగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం, మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించాలి
కాజీపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధిని, విద్యార్థులు కష్టపడి చదివి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో సీట్లుసంపాదించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కోరారు. శుక్రవారం సాయంత్రం పీఎం శ్రీ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులు ట్వినింగ్ ఆఫ్ స్కూల్స్ లో భాగంగా కాజీపేటలోని ఎన్ ఐటీలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.