ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

హనుమకొండ సిటీ, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఆర్అండ్ బీ, పోలీస్, రవాణా, మున్సిపల్, హైవే అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కోరారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ లో సీపీ అంబర్ కిషోర్ ఝా, మున్సిపల్ కమిషనర్ అశ్వినితానాజీ వాకడేతో కలిసి డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ అథారిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫాతిమానగర్ ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని, కడిపికొండ ఆర్వోబీ బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని కోరారు. 

జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో గూడెప్పాడ్ జంక్షన్ పనులను చేయాలన్నారు. వడ్డెపల్లి జంక్షన్ దగ్గర సిగ్నల్స్, కటాక్షాపూర్ దగ్గర పనులను పూర్తి చేయాలన్నారు. సీపీ మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ప్రయాణాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, అడిషనల్ డీసీపీ సలీమా, ఆర్అండ్ బీ ఈఈ సురేశ్, ఆర్టీఏ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా, హనుమకొండ కలెక్టరేట్​లో  ప్రభుత్వ పథకాల నిర్వహణ సభలపై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. టోల్ ఫ్రీనెంబర్ 180042 51115 ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.