భీమదేవరపల్లి, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ (38) తనకున్న 20 గుంటల భూమితో పాటు మరో 1.20 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సాగు పెట్టుబడులతో పాటు రెండు బావులు తవ్వడం కోసం రూ.లక్షల్లో అప్పు చేశాడు. రెండు బావులు తవ్వినా నీళ్లు పడకపోవడంతో ప్రవీణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఈ నెల 25న పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రవీణ్‌ను వరంగల్ ఎంజీఎంకు తరలించగా, అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం చనిపోయాడు. తండ్రి మొగిళి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.