పరకాల: హనుమకొండ జిల్లా పరకాలలో ఓ చిట్ ఫండ్ సంస్థ యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారి వల్లే తాను చనిపోతున్నట్టు లెటర్ రాసి సూసైడ్ అటెంప్ట్ చేశారు. చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుడు దుమాల బాబురావు తెలిపిన ప్రకారం రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, బీఆర్ఎస్వీ నాయకుడు నాగరాజులు తనను మోసం చేశారంటూ సూసైడ్ నోట్ లో తెలిపాడు.
రెండు కాల్ రికార్డింగ్స్ ను వాట్సాప్ లో పోస్ట్ చేశారు. చిట్ ఫండ్లో వారు చేసిన మోసాల వల్ల తనతోపాటు చిట్టీ వేసిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు చిట్ ఫండ్ లో డైరెక్టర్లుగా ఉండి వాటాల నుంచి తప్పుకున్నారని చెప్పారు. ఆ తరువాత తానే వారికి అప్పు ఉన్నట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనకు చెందిన రూ.2.50 కోట్ల విలువ చేసే భూమిని బినామీలకు రాయించారని తెలిపారు. ఆ తరువాత తననే చంపుతామని బెదిరించారని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. తనను మోసం చేయడంతోపాటు చిట్ఫండ్ సంస్థకు రావాల్సిన డబ్బులను ఇప్పించి బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, జిల్లాలోని ఎమ్మెల్యేలను కోరారు. కాగా బీఆర్ఎస్ నేత నాగుర్ల వెంకన్నతో పాటు అతని అనుచరుడు నాగరాజుపై పరకాల పీఎస్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం.