- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి సందేహాలు నివృత్తి చేయడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబర్ 1800 425115ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెల16వ తేదీ నుంచి అన్ని పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుందన్నారు. డబుల్ బెడ్ రూం జిల్లా నోడల్ అధికారులు శ్రీనివాసులు, మేనేజర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజినీర్ రమాదేవి ప్రజల సందేహాలను నివృత్తి చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 14 నుంచి అమలయ్యే నూతన డైట్, కాస్మోటిక్ చార్జీలపై జిల్లాలోని ప్రతి గురుకుల హాస్టల్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని చెప్పారు. పెంచిన డైట్, కాస్మోటిక్ చార్జీల వివరాలను తెలిపేలా బ్యానర్లను ప్రతి హాస్టల్ లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, డీఈవో వాసంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇనుపరాతి గుట్టల భూముల సర్వేపై కలెక్టర్ సమీక్ష
ధర్మసాగర్. వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఇనుపరాతి గుట్టల పరిధిలో ఫారెస్ట్, పట్టా భూముల సర్వేపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సర్వే ఎంతవరకు వచ్చిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఎఫ్‌వో లావణ్య, హనుమకొండ ఆర్డీవో రమేశ్ రాథోడ్ కుడా పీవో అజిత్ రెడ్డి, ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం, ఫారెస్ట్, సర్వే సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.