- ఓవర్ స్పీడ్తో బైక్ నడిపిన విద్యార్థులు
- ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో ఐదుగురికి గాయాలు
- ఇద్దరి పరిస్థితి విషమం
హసన్ పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ శివారులోని ఎస్ఆర్ యూనివర్సిటీలో శుక్రవారం ఓవర్ స్పీడ్తో బైక్నడపడంతో ఐదుగురు స్టూడెంట్లుగాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, హసన్ పర్తి పోలీసుల కథనం ప్రకారం..శుక్రవారం యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీటెక్ థర్డ్ఇయర్ చదువుతున్న తోట హార్దిక్, సాయి దీపక్ బైక్పై ఓవర్ స్పీడ్తో వర్సిటీ నుంచి బయటకు వెళ్తున్నారు. ఎదురుగా మరో బైక్పై ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న వికాస్, సాయిరాం, కార్తీక్ లోపలకు వస్తున్నారు. హార్దిక్ బైక్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బండిని ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాలేజీ సిబ్బంది గాయపడ్డవారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. హార్దిక్, వికాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. సాయి దీపక్, సాయిరాం, కార్తీక్ చికిత్స పొందుతున్నారు. కాజీపేట ఏసీబీ డేవిడ్రాజు, హసన్ పర్తి సీఐ తుమ్మ గోపి ఘటనా స్థలాన్ని సందర్శించి సీసీ ఫుటేజీ పరిశీలించారు.