మే 31 నాటికి స్కూళ్లకు యూనిఫామ్స్

మే 31 నాటికి స్కూళ్లకు యూనిఫామ్స్

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో పట్టణ పరిధిలోని 141 స్కూళ్లలో 12 వేల మంది విద్యార్థులకు యూనిఫామ్స్​అందించనున్నట్లు మెప్మా పీడీ, హనుమకొండ డీఆర్వో వైవీ గణేశ్​ తెలిపారు. ఈ మేరకు మహిళా సమాఖ్యల సభ్యులు మే 31 నాటికి పూర్తిస్థాయిలో దుస్తులు కుట్టి పాఠశాలలకు అందజేయాలని సూచించారు. హనుమకొండ, కాజీపేట, పరకాల, హసన్ పర్తి మండలాల్లోని విద్యార్థులకు యూనిఫామ్స్​కుట్టే మహిళా సమాఖ్య సభ్యులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది నుంచి జతకు రూ.75  కేటాయించారని, ప్రతి విద్యార్థి కొలతలు తీసుకొని, నిర్దేశించిన నమూనాలో దుస్తులు కుట్టి ఇవ్వాలన్నారు. 

ఒకటి నుంచి ఐదో తరగతి అబ్బాయిలకు చొక్కా, నిక్కరు, ఆరు నుంచి ఇంటర్ అబ్బాయిలకు చొక్కా, ప్యాంట్ కుట్టాలన్నారు. ఒకటి నుంచి మూడో తరగతి అమ్మాయిలకు చొక్కా, లాంగ్ ఫ్రాక్, 4, 5 చదువుతున్న అమ్మాయిలకు చొక్కా, లంగా, 6 నుంచి ఇంటర్ అమ్మాయిలకు పంజాబీ డ్రెస్ కుట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, మెప్మా జిల్లా ఇన్​చార్జి రజిత, ఎంఈవోలు మనోజ్, నెహ్రూ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.