మా ఆయన బెట్టింగ్ మానేయాలమ్మా.. మేడారం ఆమ్మవార్లకు భక్తురాలు విన్నపం

భక్తులు దేవుడి దగ్గరికి వెళితే.. తమ కోరికలను నెరవేర్చమని మొక్కుకొని.. హుండీలో కానుకలను వేస్తుంటారు. కానీ అన్నింటికీ భిన్నంగా ఓ భక్తురాలు తన కోరికలు నెరవేరాలని ఏకంగా హుండీలోనే తన కోరికలను చీటీలో రాసి వేసింది. ఈ ఘటన మేడారం హుండీల లెక్కింపులో జరిగింది. 

మేడారం మహా జాతర హుండీల లెక్కింపులో భాగంగా నాలుగో రోజైన ఆదివారం(మార్చి 3) హుండీల లెక్కింపును ప్రారంభించారు అధికారులు. ఈ నేపథ్యంలో హుండీలో ఓ భక్తురాలు రాసిన చీటీని గుర్తించారు. ఆ చీటీలో.. తన భర్త బెట్టింగ్ మానేయాలని.. తన అక్క కొడుక్కు IIT సీటు రావాలని తన కోరికలను చీటీపై రాసి.. సమ్మక్క, సారలమ్మలకు మొక్కుకొని హుండీలో వేసింది భక్తురాలు. ప్రస్తుతం ఈ చీటీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భక్తుల కోరికల్లో ఇలాంటి వింత మొక్కులు కూడా మొక్కుతున్నారా అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా నిన్న(మార్చి 2) మూడో రోజైన శనివారం మొత్తం 112 బాక్స్ లను ఓపెన్ చేయగా అత్యధికంగా రూ. 3,45,61,000 ఇన్ కం వచ్చింది. ఫస్ట్ రోజైన గురువారం రూ. రూ.3,15,40,000, శుక్రవారం రూ.2,98,35,000 ఆదాయం వచ్చింది. శనివారంతో కలిపి మూడు రోజుల్లో మొత్తం 317 హుండీలను లెక్కించడంతో ఆదాయం రూ. 9.60 కోట్లు దాటింది. మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను ఏర్పాటు చేయగా 518 బాక్స్ లు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి చేరుకున్నాయి.

మిగతా బాక్స్ లను తిరుగువారం కోసం మేడారంలోనే ఉంచారు. ఇప్పటివరకు లెక్కించిన ఆదాయాన్ని డిపార్ట్ మెంట్ బ్యాంక్‍ అకౌంట్ లో జమ చేసినట్లు అసిస్టెంట్‍ కమిషనర్‍ రామల సునీత, మేడారం ఈవ రాజేంద్రం  తెలిపారు.