అంబులెన్స్‌‌ రాలే.. జనాలు పట్టించుకోలే..

హనుమకొండ, వెలుగు: హైడ్రో క్రేన్‌‌ ఢీ కొనడంతో ఓ వ్యక్తి కాలు తెగి పడి తీవ్ర రక్తస్రావమై సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హనుమకొండ పీఎస్ పరిధి వరంగల్ ములుగు రోడ్డు సమీపంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన తీగల సారంగపాణి(52) శుక్రవారం పని మీద వరంగల్ కు వచ్చాడు. తిరిగి వెళ్తుండగా ములుగు రోడ్డులోని ఒమేగా బన్ను హాస్పిటల్ సమీపంలో సారంగపాణి బైక్ ను వెనుక నుంచి వచ్చిన హైడ్రో క్రెయిన్ వెహికిల్ ఢీకొట్టింది. దీంతో బైక్ తో సహా కిందపడి పోగా.. వెహికిల్ మీది నుంచి వెళ్లడంతో కుడి కాలు మోకాలి వరకు పూర్తిగా తెగిపోయింది. 

తీవ్ర రక్తస్రావం అవుతుండగా వెహికిల్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కొనఊపిరితో సారంగపాణి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పై కొట్టుమిట్టాడుతుండగా కొందరు108కి సమాచారం ఇచ్చారు. అరగంట వరకు అంబులెన్స్ రాకపోగా..చుట్టూ ఉన్న జనం చూస్తూనే ఉండిపోయారు తప్పితే ఎవరూ దవాఖానకు తరలించే ప్రయత్నం చేయలేదు. దీంతో తీవ్ర రక్త స్రావంతో సారంగపాణి స్పృహ కోల్పోయాడు. అరగంట తర్వాత అంబులెన్స్ వచ్చి ఎంజీఎం తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు హనుమకొండ ఎస్సై రామారావు తెలిపారు.