హనుమకొండ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ సిటీలో ఫేమస్ ఏరియాగా గుర్తింపు పొందిన హనుమకొండ నయీంనగర్ బ్రడ్జిని అధికారులు శుక్రవారం కూల్చివేయనున్నారు. నగరంలో శాశ్వత వరద ముంపు పనులు చేపడుతున్న క్రమంలో నయీంనగర్ నాలాను వెడల్పు చేసి ఇరువైపులా రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తి చేసేలా చేపట్టనున్నారు. ఈ క్రమంలో పాతదైన నయీంనగర్ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జిని కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.15 కోట్లతో నూతన బ్రిడ్జి, వాటర్ సరఫరా తదితర పనులను చేపట్టనున్నారు. శుక్రవారం ఆయా పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
కరీంనగర్ నుంచి ఖమ్మం, నర్సంపేట, వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కేయూసీ జంక్షన్నుంచి పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మ గడ్డ, ములుగురోడ్డు జంక్షన్ అమృత జంక్షన్, హనుమకొండ బస్టాండ్ మీదుగా మళ్లించనున్నట్లు వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నుంచి కరీంనగర్ వైపు పోయే భారీ వాహనాలను ఉర్సుగుట్ట, కడిపికొండ, మడికొండ ఓఆర్ఆర్ మీదుగా పంపనున్నట్లు తెలిపారు.
వరంగల్, నర్సంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను ఎంజీఎం, ములుగు రోడ్డు జంక్షన్,పెద్దమ్మగడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయూసీ జంక్షన్ మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. హనుమకొండ బస్టాండ్ నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు హనుమకొండ చౌరస్తా, అమృత జంక్షన్, ములుగురోడ్డు జంక్షన్, పెద్దమ్మగడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయూసీ జంక్షన్మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. ఇందుకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని సీపీ కోరారు.