ధర్మసాగర్ భూ వివాదం .. ఆ 43.38 ఎకరాలు పట్టా భూములే

ధర్మసాగర్ భూ వివాదం .. ఆ 43.38 ఎకరాలు పట్టా భూములే
  • దేవునూరు శివారు అటవీప్రాంతంలో వివాదంపై ఆర్డీవో క్లారిటీ
  • మిగతా భూమంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కే చెందుతుందని వెల్లడి

హనుమకొండ, వెలుగు: ధర్మసాగర్ మండలంలో కొంతకాలంగా వివాదం నెలకొన్న ముప్పారం శివారు 213, 214, 215, 216, దేవునూరు శివారు 403, 404 సర్వే నెంబర్లలోని 43 ఎకరాల 38 గుంటలు పట్టా భూమేనని, అటవీశాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో లేకపోయినా ఆ పట్టా భూములు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధీనంలోనే ఉన్నట్లు గుర్తించామని హనుమకొండ ఆర్డీవో రమేశ్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామ రైతులు వారి పట్టా భూములు సాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అటవీశాఖ సిబ్బంది అడ్డుకుంటుండటంతో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి జాయింట్ సర్వే చేసేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారన్నారు. 

ఈ మేరకు ఫారెస్ట్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించామన్నారు. దాదాపు 60 ఏండ్ల కింద అటవీశాఖ అధికారులు ముప్పారం, దేవునూరు, ఎర్రబెల్లి, దామెర, కొత్తపల్లి గ్రామాల పరిధిలోని 3,750 ఎకరాల విస్తీర్ణంతో ప్రతిపాదనలు రూపొందించినట్లు ఆర్డీవో పేర్కొన్నారు. కానీ ఫారెస్ట్ బ్లాక్ కోసం ఆయా గ్రామాల పరిధిలోని 3,956 ఎకరాలు అటవీశాఖ ఆధీనంలో ఉన్నట్లు తేలిందన్నారు. రెవెన్యూ రికార్డులు పరిశీలించగా, ఆయా సర్వే నెంబర్లలో 23 మంది రైతులు వారసత్వం, కొనుగోలు ద్వారా పట్టాదారులుగా ఉన్నారని తెలిపారు. 43.38 ఎకరాల విషయంలోనే వివాదం ఉందని, మిగతా సుమారు 3900 ఎకరాల భూమిలో ఎలాంటి వివాదం లేదని పేర్కొన్నారు. 

ఇందులో 43.38 ఎకరాలను అటవీశాఖ నుంచి పట్టాదారులకు, మిగులు భూమి మొత్తం అటవీశాఖకు చెందే విధంగా కలెక్టర్ కు నివేదిక ఇచ్చామన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పట్టా భూములను తమ ఆధీనం నుంచి వదులుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు 10 రోజుల సమయం కోరినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఇనుపరాతి గట్లను రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాగా ప్రకటించేందుకు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం ప్రతిపాదనలు పంపిస్తుందని తెలిపారు. కుడా ఆధ్వర్యంలో ఇక్కడ ఎకో టూరిజం పార్క్ డెవలప్మెంట్స్ కోసం ప్రతిపాదించి, పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు ఆర్డీవో వివరించారు.