వరంగల్ సిటీ డంప్​యార్డ్ ఎఫెక్ట్​..​ గాలి,నీళ్లు కరాబ్​.! కాలుష్య కోరల్లో మడికొండ, రాంపూర్​ గ్రామాలు

వరంగల్ సిటీ డంప్​యార్డ్ ఎఫెక్ట్​..​ గాలి,నీళ్లు కరాబ్​.! కాలుష్య కోరల్లో మడికొండ, రాంపూర్​ గ్రామాలు
  • కాలుష్య కోరల్లో మడికొండ, రాంపూర్​ గ్రామాలు
  • ఎయిర్​ క్వాలిటీకి దెబ్బ.. ప్రమాదానికి చేరువలో నీరు
  • తాజాగా పీసీబీ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడి
  • డంప్​యార్డు తరలించాలని వంద రోజులుగా ఉద్యమిస్తున్న ప్రజలు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్​ డంప్​ యార్డుతో ముప్పు ముంచుకొస్తోంది. దాని నుంచి వచ్చే పొగతో ఎయిర్​ పొల్యూషన్​ పెరుగుతుండగా, చెత్తాచెదారం భూమిలో కలిసిపోయి నీళ్లు కూడా కలుషితమవుతున్నాయి. ఇటీవల పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఆఫీసర్లు మడికొండ డంప్​యార్డు వద్ద గాలి, నీళ్లు టెస్టులు చేసి వెల్లడించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతోందని, డంప్​యార్డును ఇక్కడి నుంచి తరలించి తమకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

డంప్​యార్డు ప్రభావిత గ్రామాల ప్రజలు ఉద్యమం చేపట్టగా, సమస్యకు సరైన పరిష్కారం దొరక్క ఆఫీసర్లు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. మంగళవారం నాటికి ఉద్యమానికి వంద రోజులు నిండగా, డంప్​యార్డును తరలించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

తీవ్రమవుతున్న సమస్య..

జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో 2.25 లక్షలకుపైగా ఇండ్లు ఉండగా, నిత్యం 450 మెట్రిక్​ టన్నులకుపైగా తడి, పొడి చెత్త వెలువడుతోంది. మడికొండ, రాంపూర్​ శివారులోని 32 ఎకరాల స్థలంలో డంప్​యార్డు ఏర్పాటు చేయగా, సరైన ట్రీట్​మెంట్​ లేక ఆరు లక్షల మెట్రిక్ టన్నులకుపైగా చెత్త అందులో పోగైంది. 2021లో స్మార్ట్ సిటీ స్కీంలో భాగంగా డంప్​ యార్డులో దాదాపు రూ.37 కోట్లతో 3 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్​ చేసేందుకు బయోమైనింగ్​ చేపట్టారు. 

కాంట్రాక్ట్​సంస్థ ఏండ్లు గడుస్తున్నా దానిని పూర్తి చేయలేదు. దీంతో మరో ఆరు లక్షల టన్నులకుపైగా వ్యర్థాలు పోగయ్యాయి. తాజాగా వరంగల్​జిల్లా పైడిపల్లి వద్ద మరో డంప్​యార్డు ఏర్పాటుకు ప్రతిపాదించినప్పటికీ అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వరంగల్, కరీంనగర్ మున్సిపల్​ కార్పొరేషన్లు సహా ఏడు మున్సిపాలిటీల చెత్తను హుజురాబాద్​సమీపంలోని కొత్తగా ఏర్పాటు చేస్తున్న డంప్​యార్డుకు తరలించి, అక్కడ 'వేస్ట్​టు ఎనర్జీ జనరేషన్​ ప్లాంట్' ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. కానీ స్థలం, వివిధ కారణాల వల్ల అదికాస్త కాగితాల్లోనే ఉండిపోయింది.

నీళ్లు, గాలి కలుషితం..

డంప్​యార్డు నుంచి వచ్చే పొగతోపాటు ఘాటు వాసనలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మడికొండ, రాంపూర్​ గ్రామస్తులు పలుమార్లు గ్రేటర్​ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ అధికారులు గత నెలలో అక్కడ శాంపిల్స్​ సేకరించి టెస్టులు చేశారు. ముందుగా గాలి నాణ్యతను చెక్​ చేసేందుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించి, ఇక్కడ వాతావరణం కలుషితమవుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పీఎం 10 లెవల్స్ 100 లోపు ఉండాల్సినప్పటికీ, రెండో, మూడో షిఫ్టుల్లో అంతకుమించిన నమోదవుతున్నట్లు తేల్చారు. 400 పీపీఎం లోపు ఉండాల్సిన అమ్మోనియా 600కుపైగా నమోదవుతున్నట్లు గుర్తించారు. 

వీటితోపాటు రాంపూర్ వార్డు ఆఫీస్,  ఆంజనేయస్వామి గుడి, మడికొండ వార్డు ఆఫీస్​ సమీపంలోని బోర్ల నుంచి సేకరించిన నీటిని కూడా పీసీబీ జోనల్​ లాబరేటరీలో టెస్టు చేశారు. ఇందులో పీహెచ్​ లెవల్ 6.5 నుంచి 8.5 ఎంజీ మధ్య ఉండాల్సినప్పటికీ సగటున 8ఎంజీకి పైగా నమోదు అవుతుండటం కలవరపెడుతోంది. 500లోపు ఉండాల్సిన టీడీఎస్​ 520 నుంచి 880 వరకు చూపిస్తుండటం గమనార్హం. కొన్నిచోట్లా నీటిలో కాల్షియం, మెగ్నీషియం ఫ్లోరైడ్, లెడ్, ఐరన్ తదితర వ్యాల్యూస్​ కూడా మోతాదుకు మించి ఉన్నట్లు గుర్తించారు.

వంద రోజులకు చేరిన ఉద్యమం..

చెత్తతో ఓ వైపు కాలుష్యం పెరిగిపోతుండటం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతుండటంతో డంప్​యార్డును ఇక్కడి నుంచి తరలించాలని కొద్దిరోజులుగా మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 19న చేపట్టిన ఉద్యమం వంద రోజులుగా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతవరకు ఆఫీసర్లు సొల్యూషన్​ మాత్రం చూపలేకపోతున్నారు.

మడికొండ డంప్​యార్డులో గోబర్​ ధన్​ స్కీం కింద రెండు బయో గ్యాస్ ప్లాంట్లు, స్మార్ట్​ సిటీ కింద పవర్​ జనరేషన్​ప్రాజెక్టులకు ప్రతిపాదన ఉన్నా వాటికి మోక్షం కలగకపోవడం, హుజూరాబాద్​డంప్​యార్డు వినియోగంలోకి రాకపోవడంతో సమస్యకు ఫుల్​స్టాప్​ పడటం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు మడికొండ డంప్​యార్డుపై ఫోకస్​పెట్టి, తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.