
- సమస్యల వలయంలో చింతగట్టు ఆఫీసు
- మూడు నెలలవుతున్నా సౌలతులు కరువు
హనుమకొండ, వెలుగు: చింతగట్టు సమీపంలోని హనుమకొండ ఆర్టీఏ ఆఫీసులో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రజల నుంచి నిత్యం రూ.లక్షల్లో ఆదాయం పొందే ఆ శాఖ.. సౌలతులు మాత్రం కల్పించడం లేదు. తాగడానికి నీళ్లు, వినియోగించుకోవడానికి టాయిలెట్స్ కూడా లేవు. డ్రైవింగ్ టెస్టు కోసం రోడ్లు, ట్రాక్ లు లేకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గతంలో రంగశాయిపేట సమీపంలోని నాయుడు పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఈ ఆఫీసును చింతగట్టుకు మార్చి మూడు నెలలు అవుతున్నా సౌకర్యాలు కల్పించడం లేదు.
సమస్యల సుడిగుండం..
హనుమకొండ ఆర్టీఏ ఆఫీసుకు నిత్యం 200 నుంచి 300 వరకు వస్తుంటారు. ఈ మధ్య ట్రాఫిక్ రూల్స్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో రద్దీ మరింత పెరిగింది. కానీ జనాలకు తగ్గట్టుగా సౌలతులు లేవు. నీళ్లు, టాయిలెట్స్ తో పాటు కూర్చోడానికి కుర్చీలు లేవు. బండ్లు పెట్టుకోడానికి పార్కింగ్ లేదు. డ్రైవింగ్ టెస్టుకు ట్రాక్ కూడా నిర్మించలేదు. తరచూ సర్వర్ డౌన్ అవుతుండడంతో గంటల కొద్దీ ప్రజలు బారులు తీరుతున్నారు. మహిళలు మరింత ఇబ్బంది పడుతున్నారు.
కలగానే పర్మినెంట్ బిల్డింగ్..
హనుమకొండ ఆర్టీఏ ఆఫీసుకు పర్మినెంట్ బిల్డింగ్ కరువైంది. గతంలోనూ అద్దె భవనంలో కొనసాగగా ఇప్పుడు కూడా రెంటెడ్ బిల్డింగ్ లోనే దీనిని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు పర్మినెంట్ బిల్డింగ్ కోసం మడికొండలో స్థలం చూడగా అది ప్రతిపాదనలకే పరిమితం అయింది. చింతగట్టులో ఏర్పాటు చేసి, మూడు నెలలు దాటినా సౌకర్యాలు కల్పించడం లేదు. ఆఫీసర్లను అడిగితే ప్రపోజల్స్ పంపించినట్లు చెబుతున్నారు.
నీళ్లు కూడా లేవు
ఆర్టీఏ ఆఫీస్‌ను చింతగట్టుకు షిఫ్ట్ చేసిన తరువాత అందులో కనీస సదుపాయాలు కల్పించలేదు. కనీసం వాటర్ సౌకర్యం కూడా లేదు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు ఇతర సేవలకు ఛార్జ్ చేస్తున్న అధికారులు సౌకర్యాలు కల్పించడం పైనా దృష్టి పెట్టాలి.
- ఆరెల్లి శివ, వాహనదారుడు
ఇబ్బందులు పడాల్సి వస్తోంది
రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్తే మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసమని పోతే అక్కడ ట్రాక్ సరిగా లేదు. మట్టి, కంకరపైనే బండి నడిపించి టెస్టులు చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు ఆఫీస్‌లో తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలి.
- ఈసంపల్లి సుధీర్, వాహనదారుడు