‘హను మాన్’ చిత్రంలో మీనాక్షి పాత్రలో ఆకట్టుకుంది అమృత అయ్యర్. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా అమృత మాట్లాడుతూ ‘సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ‘హను మాన్’ ప్రేక్షకులు నచ్చాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నాం. అనుకున్నట్లుగా ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రని చక్కగా చేశానని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది.
తెలుగు సినిమాగా చిన్నగా స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్దదవుతుందని ఊహించలేదు. తేజతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. తను చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే వరలక్ష్మీ శరత్‌కుమార్ లాంటి సీనియర్‌తో కలసి పని చేయడం కూడా మంచి అనుభూతి. ఆమె నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నా. సెట్‌లో అందరినీ పరిశీలిస్తాను. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాను. ఈ సినిమా కూడా నాకు వెరీ మెమొరబుల్ జర్నీ. ఈ ప్రయాణంలో సహనంగా ఉండటం నేర్చుకున్నా. గ్లామర్ రోల్స్ కన్నా.. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెండ్ పాత్రలే చేస్తాను. తక్కువ సినిమాలు చేసినా కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నా. ‘హను మాన్ 2’ గురించి థియేటర్స్‌లో చూసి నేను కూడా సర్‌ప్రైజ్ అయ్యా. ప్రస్తుతం నరేష్ గారి సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నా’ అని చెప్పింది.