Hanuman Jayanti : శక్తికి ప్రతిరూపం బజరంగబలి

Hanuman Jayanti : శక్తికి ప్రతిరూపం బజరంగబలి

బహు బలశాలి హనుమంతుడు. ఆరాధన, సేవాగుణానికి నిలువెత్తు సాక్ష్యం.  రాముల వారిని గుండెల్లో బంధించుకొని, వానర సైన్యాన్ని కూడగట్టి వారధి నిర్మించిన అపర భక్తుడు. హనుమంతుని గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం.  ధైర్యం, నిజాయితీ, క్రమశిక్షణ, మానవత్వం. ఆ లక్షణాలు నేటి తరం యువతకు ఆదర్శం కావాలి. ఆంజనేయస్వామి సంకల్పశక్తిని నేటితరం అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది బజరంగ్ దళ్. అందుకే హనుమాన్  జన్మ దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో  భారీ  హిందూ శక్తి ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తోంది. 2004 సంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ దినదినం ఖ్యాతిని కీర్తిని పొందుతూ విశ్వవ్యాప్తంగా విస్తరిస్తోంది.  దేశంలోనే భాగ్యనగర్ బజరంగ్ దళ్ నిర్వహించే  హనుమాన్ జయంతి ర్యాలీ రికార్డు సృష్టిస్తోంది.  ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఏప్రిల్ 12వ తేదీన భాగ్యనగరం నడిబొడ్డులోని  గౌలిగూడ హనుమాన్ మందిరం నుంచి సికింద్రాబాద్ తాడ్​బండ్ హనుమాన్ మందిర్ వరకు లక్షలాది  యువకిశోరాలతో  భారీ ర్యాలీ నిర్వహిస్తోంది.

హిందూ శక్తి యాత్ర

విశ్వహిందూ పరిషత్ యువ విభాగమైన బజరంగ్ దళ్ నిర్వహించే ఈ శోభాయాత్ర హిందూ ఐక్యతకు ప్రతిరూపం. ఈ యాత్రకు ప్రతి ఇంటి నుంచి ఒక కార్యకర్త తన బైక్ తీసుకొని, దానికి కాషాయం జెండా కట్టుకొని బయలుదేరుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాన చినుకులా ఇంటి నుంచి బయలుదేరి న కార్యకర్తల సమూహం జడివానలా మారి, గౌలిగూడ హనుమాన్ దగ్గర పెద్ద ప్రవాహంగా ఉధృతం అవుతుంది. గౌలిగూడ హనుమాన్ నుంచి ప్రారంభమై కోటి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, బైబిల్ హౌస్, సికింద్రాబాద్ మీదుగా బోయినపల్లిలోని తాడ్​బండ్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుంది. 

రాజకీయాలకు అతీతంగా..

 బజరంగ్ దళ్ హనుమాన్ యాత్ర రాజకీయాలకు అతీతం.   కాషాయ జెండాలు, తోరణాలతో నగరమంతా శోభాయమానమవుతుంది. ఇది కేవలం భాగ్యనగర్ వరకే పరిమితం కాలేదు. హనుమాన్ జన్మోత్సవం పేరిట ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతాయి.   ఆబాలగోపాలం హిందూ సమాజమంతా ఆంజనేయస్వామి సేవలో తరిస్తారు. 

భారతీయ విలువల వ్యాప్తి కోసం..

భారతీయ విలువలను  ప్రపంచ దేశాలకు అందించేందుకు, యువకులలో ఆత్మస్థైర్యం నింపేందుకు హిందూ శక్తి ప్రదర్శన ర్యాలీ ద్వారా సందేశం అందిస్తోంది. హిందూ మహిళలను కాపాడుకోవడంలో, ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాత రక్షణ విషయంలో, హిందూ  మందిరాల సంరక్షణ సమరంలో,  భారతీయ విలువల  పరిరక్షణలో నిరంతరం పోరు చేస్తోంది.  విదేశీ విష సంస్కృతికి పాతరేసి, కుటుంబ విలువలను పెంచి పోషించేందుకు నిరంతరం తపిస్తోంది బజరంగ్ దళ్. పేద, ధనిక, అణగారిన వర్గాలు, అగ్రవర్ణాలు అని విభేదాలకు తావు లేకుండా హిందువులంతా ఒక్కటే అని భావిస్తోంది. హిందూ సమైక్యరాగంతో విజయదుందుభి మోగించేందుకు వీర హనుమాన్ విజయ యాత్రకు సిద్ధమవుతోంది.  వీర హనుమాన్ విజయ యాత్రలో లక్షలాదిగా పాల్గొందాం. హనుమాన్​జీ ఆశీస్సులు పొందుదాం.

- పగుడాకుల బాలస్వామి,
 ప్రచార ప్రసార ప్రముఖ్ 
వీహెచ్​పీ, తెలంగాణ