Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు చేయాల్సిన పనులు ఏంటి? చేయకూడని పనులు ఏంటి అనే వివరాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. హనుమత్ జయంతి రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఆరోజు హనుమంతుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. . .
చైత్ర మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున అంజనీ దేవి కుమారుడిగా ఆంజనేయుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే హిందూ మతంలో హనుమాజ్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు.హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం.
హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఉపవాసం ఉంటారు. ఆరోజు పూజలు చేయడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తారు. హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదని విషయాలు తెలుసుకుందాం.
హనుమాన్ జయంతి రోజు చేయకూడని పనులు
- హనుమాన్ జయంతి రోజు మాంసం, మద్యం పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఆరోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి.
- ఈరోజున విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిరిగిన చిత్రపటాన్ని పూజించకూడదు. దాన్ని దేవాలయంలో లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి. మంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేయాలి.
- హనుమంతుడిని పూజించేందుకు ఎరుపు, నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున తెలుపు, నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటమే మంచిది. ఇలా చేస్తే హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. మరీ ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది.
- హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతాన్ని పెట్టకూడదు. వాటితో అభిషేకం చేయకూడదు. భజరంగ్ బలికి ఇష్టమైన శనగపప్పు, బూందీ లడ్డు, సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
- హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఈరోజు ఉప్పు లేదా రాతి ఉప్పు తినకూడదు.
పూజా విధానం
- హనుమాన్ జయంతి ఉపవాసానికి ముందు రోజు రాత్రి నేలపై పడుకుని రాముడు, సీతాదేవి, హనుమంతుడిని స్మరించుకోవాలి.
- ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
- పూజ గదిలో ఒక చిన్న పీట వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రం పరచాలి. తర్వాత దానిపై హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
- హనుమంతుడికి పండ్లు, ధూప, దీపాలు, నైవేద్యం సమర్పించాలి. శనగపిండి లడ్డూ లేదా బూందీ లడ్డు నైవేద్యంగా పెడితే హనుమంతుడు సంతోషిస్తాడు. తర్వాత హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి. అలా చేయడం వల్ల మీకు హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి.
- ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగిస్తే శని దోషం కూడా తొలగిపోతుంది.
- హనుమంతుడికి మల్లె నూనె దీపం అంటే చాలా ఇష్టమైనదిగా పండితులు చెబుతారు. ఈ దీపం వెలిగిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరతాయి.