ఆసిఫాబాద్లో కనుల పండువగా హనుమాన్ శోభాయాత్ర

ఆసిఫాబాద్, వెలుగు: హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి శోభాయాత్ర కనులపండువగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన యాత్రను జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు అరిగెల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు కె.విశ్వ ప్రసాద్ రావు పూజలు చేసి ప్రారంభించారు.

మహిళలు మంగళహారతులతో శోభాయాత్రకు స్వాగతం పలికారు.  హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి శోభాయాత్రలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.

హనుమాన్ దీక్షతో సంపూర్ణ ఆధ్యాత్మికత

నిర్మల్: హనుమాన్ దీక్షకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆ దీక్ష ద్వారా సంపూర్ణ ఆధ్యాత్మికత చేకూరుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక దేవరకోట దేవస్థానం నుండి హనుమాన్ భక్తులు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు ధర్మాన్ని రక్షిస్తాయన్నారు.