హనుమాన్ జయంతి ఏడాదికి మూడుసార్లు వస్తుంది. చైత్ర పౌర్ణమిరోజు , వైశాఖ దశమి రోజు ( జూన్ 1) , మార్గశిర మాసంలో జరుపుకుంటారు. చైత్ర మాసానికి సంబంధించిన హనుమాన్ జయంతి ఇప్పటికే పూర్తి కాగా.. వైశాఖ దశమి హనుమాన్ జయంతిని జూన్ 1 శనివారం నాడు జరుపుకోనున్నారు. మరి ఈ రోజున స్వామి వారి అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో.. పురాణాల్లో ఏముంది..పండితులు ఏం చెబుతున్నారో.. తెలుసుకుందాం. . .
దృక్ పంచాంగం ప్రకారం.. వైశాఖ మాసం కృష్ణ పక్షం దశమి తిథి అంటే 2024 జూన్1వ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. హనుమాన్ జయంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుని విగ్రహానికి సింధూరం, తమలపాకులు సమర్పించాలి. మల్లె నూనెతో దీపం వెలిగించి, గులాబీ పూల దండను విగ్రహం/పటానికి వేసి భజరంగబలికి ఇష్టమైన బెల్లం, పప్పును నైవేద్యంగా పెట్టాలి. హనుమాన్ చాలీసా 7 సార్లు చదవాలి. ఇంట్లో రామాయణ పారాయణం చేయడం చాలా మంచిది. హారతి ఇచ్చిన తరువాత శక్తి మేరకు పేదవారికి వస్త్రాలు, ఆహారం, డబ్బును దానం చేయొచ్చు.
చేయాల్సిన పరిహారాలు..
- హనుమాన్ జయంతి నాడు ( జూన్ 1) స్వామి వారికి గులాబీ పూల దండ వేస్తే.. ఆయన అనుగ్రహం పొందవచ్చని.. ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని స్కంద పురాణంలో పేర్కొన్నారు
- చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే, హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలని.. ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుందని.. ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
- తమలపాకులు అంటే హనుమంతుడికి మహా ఇష్టం. వాటి మీద జైశ్రీరామ్ అని రాసి తమలపాకుల దండ సమర్పించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం మీ మీద ఉండి.. కోరుకున్నవన్నీ జరుగుతాయని చెబుతున్నారు.
- వ్యాపారాన్ని మెరుగుపరచడానికి, హనుమాన్ జయంతి నాడు స్వామికి సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలని.. ఆంజనేయ స్వామి గుడిని కాషాయం జెండాలతో అలంకరించాలని అంటున్నారు. ఇది వ్యాపారంలో వచ్చే ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుందని చెబుతున్నారు.
- హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడికి శనగపిండి, ఎర్ర చోళం సమర్పించాలి. అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని.. అప్పుల సమస్యల నుంచి బయట పడి ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయని అంటున్నారు.
- ఆర్థిక శ్రేయస్సు కోసం తెల్ల కాగితంపై కాషాయ రంగుతో స్వస్తిక్ గుర్తు రాసి హనుమంతునికి సమర్పించి.. ఆ తరువాత ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలని అంటున్నారు. ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయని అంటున్నారు.
- శని దోషం పోగొట్టేందుకు ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఆవనూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలని.. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.