సదాలోచనలతో సత్సంతానం

సదాలోచనలతో సత్సంతానం

‘జంతూనామ్‌‌‌‌‌‌‌‌ నరజన్మ దుర్లభం’  మానవ జన్మ దుర్లభమైనది.ఈ భూలోకంలోని ప్రాణికోటిలో మానవ జన్మ లభించడం చాలా గొప్ప అదృష్టం అని వేదాలు ఉపనిషత్తులు, శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. కొన్ని లక్షణాలు మానవులకు పుట్టుకతోనే వస్తాయి. పుట్టుకతో వచ్చిన లక్షణాలు పుడకలతోనే పోతాయి’ అనే సామెత తెలిసిందే. ఈ కారణంగానే గర్భం ధరించినది మొదలు తల్లి సదాలోచనలతో ఉండాలని వైద్యులు, తల్లి ఎటువంటి ఆలోచనలు చేస్తుందో, అటువంటి సంతానమే పుడతారని శాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయి.

మహాభారతం పరిశీలిస్తే...

సత్యవతి కుమారులైన విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు మరణించడంతో, ఆవిడ తన కుమారుడైన వ్యాసుని స్మరించి, తన వంశాన్ని నిలబెట్టమని కోరింది. సరేనన్నాడు వ్యాసుడు. ముందుగా అంబికను వ్యాసుని సమక్షానికి పంపగా, ఆవిడ వ్యాసుని రూపాన్ని చూడలేక కళ్లు మూసుకుంది. ఆ కారణంగా అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు.

 ఆ తర్వాత అంబాలికను పంపింది సత్యవతి. వ్యాస మహర్షిని చూడగానే ఆవిడ శరీరం కంపించింది. ఆ కారణంగా పాండురాజు కంపిత దేహంతో జన్మించాడు. మళ్లీ అంబికను వ్యాసుని దగ్గరకు వెళ్లమని కోరగా, ఆవిడ తన దాసిని పంపింది. సాక్షాత్తు వ్యాసభగవానుని అనుగ్రహాన్ని పొందబోతున్నానని ఆవిడ పరవశించిపోయింది. ఆ కారణంగానే.. సకల నీతిశాస్త్రాలు తెలిసిన విదురుడు జన్మించాడు. తల్లి ఆలోచన కారణంగా ఒకరు అంధులుగా, ఒకరు కంపిత దేహులుగా, ఒకరు శాస్త్రకోవిదునిగా జన్మించినట్లు భారతం చెబుతోంది.

కుంతీదేవి యమధర్మరాజు వరప్రసాదంతో ధర్మరాజుకు జన్మనిచ్చిన వార్త విన్న గాంధారి అసూయతో విచక్షణ కోల్పోయి, గర్భతాడనం చేసుకుంది. అందువల్లే దుర్యోధనాదులు అసూయతో రగిలిపోతూ, పాండవుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వంశ క్షేమం కోసం దుర్యోధనుడిని విడిచిపెట్టమని పెద్దలు చెప్పినప్పటికీ, పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు విడిచిపెట్టలేదు. ఆ అసూయ కారణంగానే వంశం నాశనమైంది. అసూయతో నిండిన ఆలోచనలతో తల్లి గర్భం ధరిస్తే.. పిల్లవాడు కూడా అసూయతోనే పుడతాడని ఈ కథ మనకు చెబుతోంది. గాంధారి చేసుకున్న స్వయంకృతాపరాధమే ఇది అని వ్యాసుడు చెబుతున్నాడు.

ఇక పాండవుల విషయానికి వస్తే...

పాండురాజు కోరిక మేరకు ధర్మాన్ని అనుసరించి కుంతీదేవి... యమధర్మరాజును, వాయుదేవుడిని, ఇంద్రుడిని... నిష్కల్మషమైన మనస్సుతో, ప్రశాంత చిత్తంతో ప్రార్థించింది. మాద్రి సైతం అశ్వినీ దేవతలను భక్తిపూర్వకంగా ప్రార్థించింది. అందువల్లనే పాండవులు ధర్మబద్ధంగా, తమ పరాక్రమాన్ని సత్కార్యాల కోసం వినియోగించారు.

 గొప్ప యోధులుగా నిలిచారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందరు మోసాలు చేసినా, కపట జూదం ఆడినా, ధర్మానికి కట్టుబడి ఉన్నారు. అందరినీ సర్వనాశనం చేయగలిగిన పాశుపతాస్త్రం తన దగ్గర ఉన్నప్పటికీ, దేశ క్షేమం కోసం అర్జునుడు ఆ అస్త్రాన్ని ప్రయోగించకుండా, అన్నగారి వెంట ధర్మమార్గంలో పయనించాడు.

మహాభారతంలోనే సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు సుభద్ర అర్జునులతో ఎన్నో వీరోచిత గాథల గురించి ప్రసంగిస్తూ, పద్మవ్యూహంలోకి ప్రవేశించడం గురించి కూడా ప్రస్తావించడం అభిమన్యుడు విన్నాడని, అది గమనించిన శ్రీకృష్ణుడు వ్యూహం నుండి బయటకు రావడాన్ని చెప్పకుండా ఆపేశాడని, అందువల్లే కేవలం ప్రవేశించడం తెలిసిందేగాని, బయటకు రాలేకపోయాడనే విషయం ప్రచారంలో ఉంది. సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు లోపల పిండాకారంలో ఉన్న జీవి అన్ని విషయాలు వింటుందని శాస్త్రమే కాదు, మహాభారతం కూడా చెబుతోంది.

ఇక శ్రీమద్భాగవతంలో ప్రహ్లాదుడు...

హిరణ్యకశిపుడు రాక్షసుడు. తన రాజ్యంలోని ప్రజలంతా తన పేరునే స్మరించాలని శాసించాడు. కాని హిరణ్యకశిపుని భార్య లీలావతి మాత్రం నిరంతరం విష్ణుమూర్తిని ధ్యానిస్తుండేది. ఆమె గర్భం ధరించిన సమయంలోనూ హరినామస్మరణతో తన్మయురాలైంది. ఆ స్మరణం తన గర్భంలో ఉన్న ప్రహ్లాదుడిని ప్రభావితం చేసింది. అందువల్లే ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమావధిగా నిలిచాడు. హిరణ్యకశిపుడు ఎన్ని శిక్షలు విధించినా తన ఆలోచనను మరల్చుకోలేదు.

అష్టావక్రుడు..

పూర్వం ఏకపాదుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిరంతర తపోనిరతుడు. ఏకాగ్రతతో ఏకదీక్షతో ఆరు వేదాంగాలతో కూడిన వేదాధ్యయనం చేశాడు. ఆయన భార్య సుజాత. ఉత్తమురాలు, భర్తకు ఎన్నో ఉపచారాలు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడం వల్ల ఆయన దగ్గరకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి వేదాధ్యయనం చేసేవారు. 

శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. సుజాత భర్త అనుగ్రహంతో గర్భవతి అయింది. ఆ బాలుడు తల్లి గర్భంలో ఉండగానే వేదాలు వల్లెవేయసాగాడు. గర్భంలో ఉండగానే తండ్రిని తప్పు పట్టాడు. అది గ్రహించిన తండ్రి ఎంతో సంతోషించాడు. 

కాని పుట్టకుండానే తప్పు పట్టాడని, వక్రంగా పలికాడని కోపంతో, ‘ఎనిమిది వంకరలతో పుట్టుదువుగాక’ అని శపించాడు. ఆ కారణంగా ఆ బాలుడు ఎనిమిది వంకరలతో పుట్టి, అష్టావక్రుడయ్యాడు. తండ్రి మాటలను వింటూ పుట్టకముందే వేదాలను అధ్యయనం చేయడానికి, శాపం పొందడానికి రెండింటికీ తండ్రి పలికిన వాక్కులే కారణం. అందుకే గర్భంలో ఉండే శిశువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ కథలన్నీ చెబుతున్నాయి.

- డా. పురాణపండ వైజయంతి-