ఒకప్పటి తెలుగు సినిమా అంటే కమర్షియల్. అడపాదడపా వచ్చే ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. నాటి తెలుగు సినిమాల కలెక్షన్లు కష్టంగా వంద కోట్ల రూపాయలు దాటేవి. ఈ లెక్కను పూర్తిగా మార్చేస్తున్నారు నేటి తెలుగు దర్శకులు, అగ్ర నటులు. ఓ అగ్ర హీరో అయితే మన తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులకు అంతర్జాతీయ స్థాయిలో కలలు కనే ధైర్యం ఇచ్చాడు. అతి ముఖ్యమైన ఐదేళ్లని ఆ చిత్రానికి అంకితం చేసి తెలుగు పరిశ్రమ గుర్తింపుని.. బాక్సాఫీస్ రూపు రేఖలని మార్చేశాడు. అతనే 'ప్రభాస్'. ఆయన నటించిన ఆ మ్యాజికల్ మూవీ ‘బాహుబలి’. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనమిది.
ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం..
ఒకప్పుడు కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు. తెరపై ఆయన ఆహార్యం అలాంటిది. అలా ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో, అమరేంద్ర బాహుబలిలా ‘ప్రభాస్’ ఠీవీగా నడిచి వస్తుంటే, రాజంటే ఇలా ఉండాలి అనిపిస్తుంటుంది.ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్ల కలెక్షన్, కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కటౌట్ కి మైనపు ప్రతిమను బ్యాంకాక్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు.
ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ..
నిర్మాతగా ఉన్న తండ్రి సూర్య నారాయణ రాజు, హీరోగా చేసిన పెద్దనాన్న కృష్ణం రాజు తర్వాత వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో ప్రభాస్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అనంతరం వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో లాంటి భారీ విజయాలని సాధించారు. 20 ఏళ్ళలో ప్రతి చిత్రానికి చాలా కష్టపడుతూ, తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ ముందుకెళుతున్నారు. రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయిని దాటి అంతర్జాతీయ అభిమానులని గెలుచుకున్నాడు. అసలు ప్రభాస్ లేకపోతే ‘బాహుబలి’ చిత్రమే లేదు అని దర్శధీరుడు రాజమౌళి స్వయంగా అన్నారంటే.. ఆయన డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
ఆప్యాయంగా 'డార్లింగ్' అని పిలుస్తూ..
20 ఏళ్ళ పాటు ప్రేక్షకుల హృదయాల్లో మకుటం లేని మహారాజులా ఎదుగుతూ, అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగినా ప్రభాస్ గర్వం లేకుండా తన సహ నటులతో ఆప్యాయంగా 'డార్లింగ్' అని పిలుస్తూ పిలిపించుకుంటూ ఉంటారు. తన కెరీర్లో ఎలాంటి కాంట్రవర్సీ జోలికి పోలేదు. మళ్ళీ మళ్ళీ ప్రభాస్ తో పని చేయాలనిపిస్తుందని దిగ్గజ నిర్మాతలు, దర్శకులు చెబుతున్నారంటే నటుడిగా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది.
ప్రస్తుతం ‘ప్రభాస్’ మూవీ కోసం టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణనకి తగ్గట్టుగా ఉండే ఆహార్యం సహజంగానే ఉన్న ప్రభాస్ ఇందులో ‘రాఘవ రాముడి’గా కనిపించనున్నారు. పూర్తి 3డి టెక్నాలజీ తో రూ. 250 కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
క్యూలో మరిన్ని సినిమాలు..
- ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘ప్రభాస్’ హీరోగా డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీని వాడుతూ తెరకెక్కుతున్న చిత్రం 'సలార్'. ఇందులోని యాక్షన్, విజువల్స్ ఇదివరకెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయట.
- వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె' పై విపరీతమైన అంచనాలున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి పాన్ ఇండియన్ నటులు ఇందులో నటిస్తున్నారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ తోడవడంతో ఈ చిత్రానికి ప్రపంచ దేశాల్లో భారీ మార్కెట్ దక్కనుంది.
- ఇది కాక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో, దర్శకుడు మారుతితో కూడా ‘ప్రభాస్’ నటించిన భారీ చిత్రాలు త్వరలో మొదలవ్వనున్నాయి.
20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు..
గత 20 ఏళ్లుగా ‘ప్రభాస్’ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. వరదలు వచ్చినపుడు, కొవిడ్ సమయంలోనూ భారీ విరాళాలు ఇచ్చారు. అలాగే 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకోవడమే కాక అందులో తన తండ్రి పేరు మీద ఎకోపార్క్ అభివృద్ధికి కావాల్సిన ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు. ఇలా రెబల్ స్టార్ గా మాత్రమే కాక మంచి మనసున్న మహారాజుగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ‘ప్రభాస్’. ఆయన మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని కోరుతూ అక్టోబర్ 23న పుట్టినరోజు సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు.