పర్సనాలిటీని పక్కకునెట్టి.. పర్‌‌ఫార్మెన్స్ తో గుండె తలుపులు తట్టి...

పర్సనాలిటీని పక్కకునెట్టి.. పర్‌‌ఫార్మెన్స్ తో గుండె తలుపులు తట్టి...

హీరో అంటే ఎలా ఉండాలి? ఆరడుగుల పొడవుండాలి. అందగాడు అయ్యుండాలి. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో స్ట్రాంగ్‌గా కనిపించాలి. బండ రౌడీల్ని సైతం బాది పారేసేంత బలంగా ఉండాలి. రొమాంటిక్‌ లుక్‌ ఉండాలి. స్టైలిష్‌గా కనిపించి అమ్మాయిల మనసు దోచుకోవాలి. ఇదంతా ధనుష్‌ని చూడకముందు. తనని చూశాక హీరోకి నిర్వచనమే మారిపోయింది. ‘మారి’గా బక్కపల్చని బాడీతో విలన్ల తుక్కు రేగ్గొడుతుంటే.. ఫైట్ చేయడానికి ఫిజిక్‌తో పనేముంది అని ఫిక్సైపోయారంతా. ‘కర్ణన్‌’గా గొంతెత్తి కుల వ్యవస్థను వ్యతిరేకిస్తుంటే చూసి.. నటనతో ఆకట్టుకుంటే చాలు అందం అంత అవసరమా అనుకున్నారు. ‘రాంఝనా’లో ప్రేమ కోసం పరితపించడం నచ్చి..రొమాంటిక్‌ లుక్కెందుకట కళ్లతోనే ప్రేమను కురిపిస్తుంటే అన్నారు. పర్సనాలిటీని పక్కకునెట్టి.. పర్‌‌ఫార్మెన్స్ తో గుండె తలుపులు తట్టి.. ఉత్తమ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ధనుష్‌ పుట్టిన రోజు ఈ రోజు. ఆయన గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అందులో ఆసక్తికరమైన విషయాలు కొన్ని మీకోసం.. 

ధనుష్‌కి సినిమాల్లోకి రావాలనిపించలేదు..

ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఫేమస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. అన్న సెల్వ రాఘవన్‌ కూడా ప్రముఖ దర్శకుడు. అయినా ధనుష్‌కి సినిమాల్లోకి రావాలనిపించలేదు. హోటల్ మేనేజ్‌మెంట్ చేసి షెఫ్ అవ్వాలనుకున్నాడు. కానీ అన్న బలవంతపెట్టడంతో అయిష్టంగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ధనుష్ అనేది స్క్రీన్ నేమ్ మాత్రమే. అసలు పేరు వెంకటేష్ ప్రభు. అతడు సినిమాల్లోకి వచ్చేటప్పటికే ప్రభు, ప్రభుదేవా, వెంకటేష్ లాంటి ఫేమస్ ఆర్టిస్టులు ఉండటంతో పేరు మార్చుకున్నాడు. అది కూడా కమల్, అర్జున్ కలిసి నటించిన ‘ద్రోహి’ సినిమాలోని ఫిక్షనల్ కోవర్ట్ ఆపరేషన్‌ చూసి ఇన్‌స్పైర్ అయ్యి ధనుష్‌ అనే పేరు సెలెక్ట్ చేసుకున్నాడు. ధనుష్ మొదటి సినిమా ‘తుళ్లువధో ఇలమై’కి తండ్రి కస్తూరి రాజానే దర్శకుడు. అది అంతంతమాత్రంగానే ఆడింది. అయితే అన్న డైరెక్షన్‌లో చేసిన రెండో సినిమా ‘కాదల్ కొండేన్‌’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. మానసిక రుగ్మత ఉన్న యువకుడిగా ధనుష్‌ నటనకి కాంప్లిమెంట్స్ కురిశాయి. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు ధనుష్. ఆడుకాలం, మయక్కమ్ ఎన్న, త్రీ, వడ చెన్నై లాంటి సినిమాలు ధనుష్‌ని మంచి హీరోగా నిలబెట్టాయి.

బాలీవుడ్‌లో ధనుష్‌కి మంచి ఫాలోయింగ్..

ప్రయోగాలు చేయడం మొదట్నుంచీ ఇష్టం ధనుష్‌కి. సినిమా సినిమాకీ లుక్‌ మార్చేయడం, పాత్రలో వేరియేషన్ ఉండేలా చూసుకోవడం, డిఫరెంట్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకోవడం వంటివి అతన్ని సక్సెస్‌ఫుల్ ఆర్టిస్టుని చేశాయి. అతని పర్సనాలిటీకి ‘మారి’ లాంటి గ్యాంగ్‌స్టర్ మూవీ సూటవదని చాలామంది అనుకున్నారు. కానీ ఆ పాత్రని అతను పోషించిన తీరు విజయాన్ని తెచ్చిపెట్టింది. ‘మారి 2’  అంతకు మించి హిట్టయ్యింది. కర్ణన్, అసురన్ లాంటి చిత్రాలైతే అతని ఇమేజ్‌ని పూర్తిగా మార్చేశాయి. బాలీవుడ్‌లో కూడా ధనుష్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ తీసిన ‘రాంఝనా’ సినిమాతో బీటౌన్‌లో అడుగుపెట్టాడు ధనుష్. ఓ అమ్మాయిని ప్రేమించి, ఆమె కోసం జీవితాన్నే ఇచ్చేసే యువకుడి పాత్రలో ధనుష్ నటనకి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వా ‘షమితాబ్’ అనే మూవీ చేశాడు. ఇందులో అమితాబ్‌తో కలిసి నటించాడు. పోయినేడు అక్షయ్ కుమార్‌‌తో కలిసి ‘అత్‌రంగీరే’ మూవీ చేశాడు. త్వరలో ‘రాంఝనా’ సీక్వెల్ కూడా వస్తుందని అంచనా. ఇక ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్, ద గ్రే మేన్ లాంటి ఇంగ్లిష్ చిత్రాల్లోనూ నటించాడు. త్వరలో ‘గ్రే మేన్’ సీక్వెల్ కూడా రాబోతోంది.

నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌గా

ధనుష్ సినిమాలకి టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే అతను నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. అయితే తనకున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని తెలుగులో నేరుగా మూవీ చేయడానికి రెడీ అయ్యాడు ధనుష్. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘సార్’ సినిమా చేస్తున్నాడు. శేఖర్ కమ్ములతోనూ ఒక మూవీకి కమిటయ్యాడు. మరో బిగ్‌ మూవీ కూడా లైన్‌లో పెట్టినట్టు తెలిసింది. ఇక తమిళంలో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు ధనుష్. మొదటిసారిగా ‘త్రీ’ చిత్రాన్ని నిర్మించాడు. ఆ తర్వాత కాకముట్టై, మారి, నానుమ్‌ రౌడీ దాన్, విసారణై, సినిమా వీరన్, పా పాండి, తరంగం, కాలా, వడ చెన్నై, మారి 2 వంటి చిత్రాల్ని నిర్మించాడు. ధనుష్‌లో మంచి సింగర్, లిరిసిస్ట్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు ముప్ఫైకి పైగా పాటలు రాశాడు. నలభై అయిదు వరకు పాటలు పాడాడు. దేశవ్యాప్తంగా పెద్ద హిట్టయిన ‘కొలవెరి ఢీ’ పాటను రాసింది, పాడింది కూడా ధనుషే. ఆరు నిమిషాల్లో రాసి అరగంటలో ఈ పాటని పాడేయడం విశేషం. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ పాపులర్ అయిన ‘రౌడీ బేబీ’ పాటను పాడింది కూడా అతనే. కన్నడ మూవీ ‘వజ్రకాయ’, తెలుగులో సాయితేజ్ నటించిన ‘తిక్క’ సినిమాల్లోనూ పాటలు పాడాడు ధనుష్. 

ఆరు నెలల పాటు కంటిన్యుయస్‌గా పుస్తకాలు చదివి..

తన వెర్సటాలిటీకి గాను యాక్టర్‌‌గా రెండు సార్లు, ప్రొడ్యూసర్‌‌గా రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్నాడు ధనుష్. ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులు, పద్నాలుగు సైమా అవార్డులు, తొమ్మిది విజయ అవార్డులు, ఐదు వికటన్ అవార్డులు, ఐదు ఎడిసన్ అవార్డులు తీసుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రచురించే వందమంది అత్యంత సంపన్న భారతీయుల లిస్టులో ఆరుసార్లు చోటు సంపాదించాడు. 2004లో రజినీకాంత్ కూతురు ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నాడు ధనుష్. వీరికి యాత్ర, లింగ అనే కొడుకులు ఉన్నారు. ధనుష్‌ శివభక్తుడు. అందుకే పిల్లలకు ఆ పేర్లు పెట్టుకున్నాడు. అయితే పద్దెనిమిదేళ్లు అన్యోన్యంగా జీవించాక తామిద్దరం విడిపోతున్నట్టు ధనుష్, ఐశ్వర్య ప్రకటించారు. ధనుష్‌కి మొదట్లో ఇంగ్లిష్ సరిగ్గా వచ్చేది కాదట. కనీసం చెక్ రాయడం కూడా తెలిసేది కాదని, చాలా ఫీలయ్యేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆరు నెలల పాటు కంటిన్యుయస్‌గా పుస్తకాలు చదివి తన ఇంగ్లిష్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాడట. 

ఏనాడూ నటనను అశ్రద్ధ చేయలేదు..

ధనుష్‌కి కార్లంటే చాలా ఇష్టం. అతని దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. మంచి ఫుడీ కూడా. అయితే ఇంట్లో వండిన వెజిటేరియన్ ఫుడ్‌ని మాత్రమే ఇష్టపడతాడు. 2011లో అతనిని ‘హాటెస్ట్ వెజిటేరియన్‌ సెలెబ్రిటీ’గా ప్రకటించింది పెటా. అయిష్టంగానే యాక్టర్ అయినా ఏనాడూ నటనను అశ్రద్ధ చేయలేదు ధనుష్. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు డెడికేషన్‌తో వర్క్ చేశాడు. పర్సనల్ లైఫ్‌లో ఎన్ని కాంట్రవర్శీలు వచ్చినా దాని ఎఫెక్ట్ కెరీర్‌‌పై పడనివ్వలేదు. కూల్‌గా ఉంటూ, అందరితో కలిసిపోతూ ముందుకెళ్తున్నాడు. అదే అతని విజయానికి, నేటి ఈ స్థాయికి కారణం. అతడు మరిన్ని సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. ధనుష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.