- సౌత్ ఫిల్మ్ చరిత్రలో ఇళయరాజా, మణిరత్నం కాంబినేషన్కు ప్రాధాన్యత
- ఇళయరాజా, మణిరత్నం కాంబోలో అద్బుతమైన సినిమాలు, పాటలు
- మణిరత్నం, ఇళయరాజా సౌత్ సినిమాకి టార్చ్ బేరర్స్
- ఇద్దరు దిగ్గజాలు ఒకే రోజు పుట్టడం విశేషం
- మణిరత్నంతో ఇళయరాజా మాయాజాలం
- ఇద్దరి కాంబోలో వచ్చిన పాటలు మరిచిపోగలమా..!
ఒకరికి పాటే జీవితం.. మరొకరికి చిత్రమే ప్రపంచం.. ఒకరు స్వర మాంత్రికుడు.. మరొకరు కథా ప్రేమికుడు.. ఆ ఇద్దరే సినీ సంగీత సామ్రాట్టు ఇళయరాజా.. దర్శకరత్నం మణిరత్నం. ఈ ఇద్దరు దిగ్గజాలు జూన్ 2న పుట్టడం విశేషం.
సినీ ఇండస్ట్రీలో మణిరత్నం, ఇళయరాజాలది అపూర్వ కలయిక
తమిళనాడులోని మధురైలో 1956లో మణిరత్నం పుట్టారు. పూర్తి పేరు గోపాలరత్నం సుబ్రహ్మణ్యం. చిన్నతనం నుంచీ సినిమా వాతావరణంలోనే పెరిగారు. మణిరత్నం తండ్రి రత్నం అయ్యర్.. వీనస్ స్టూడియో అధినేత. అయితే మణికి మాత్రం సినిమాలపై ఆసక్తి ఉండేది కాదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పని చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆయన మనసు సినిమాల వైపు మళ్లింది. 1983లో కన్నడ సినిమా ‘పల్లవి అనుపల్లవితో కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ చిత్రలో అనిల్ కపూర్ హీరోగా నటించారు. మొదటి సినిమాకే కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు మణిరత్నం. కమర్షియల్‌గా నిరాశను మిగిల్చినా...మ్యూజికల్ గా మాత్రం పెద్ద హిట్ ను సాధించింది. దానికి కారణం.. ఇళయరాజా.పల్లవి అనుపల్లవి సినిమా కథ రాసుకున్న తర్వాత మణిరత్నం..అద్భుతమైన సంగీతం ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ కోసం ట్రై చేశారు. సినిమాటోగ్రాఫర్ బాలూ మహేంద్ర ఆయనకి ఇళయరాజాని పరిచయం చేశారు.అప్పటికే ఇళయరాజా ఫుల్ బిజీ. మణిరత్నం ఎవరి దగ్గరా అసిస్టెంట్ గా పనిచేయలేదు. అయినా ఆయన సినిమాకు మ్యూజిక్ అందించారు ఇళయారాజా. కథతో పాటు మణి ఆలోచనలు బాగా నచ్చడంతో పల్లవి అనుపల్లవి మూవీకి సంగీతం ఇవ్వడానికి ముందుకొచ్చారు.అలా వారి ప్రయాణం మొదలైంది.
అటు ఇళయరాజా.. తమిళనాడు తేని జిల్లా పన్నైపురంలో 1943 జూన్ 2న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రామస్వామి, చిన తాయమ్. ఇళయరాజా అసలు పేరు జ్ఞాన దేశికన్. తండ్రి బోడినాయగనూర్ తేయాకు తోటలో చిన్న ఉద్యోగి, తల్లి వ్యవసాయకూలి. అమ్మతో పొలం పనులకు వెళ్లే ఇళయరాజా అక్కడ.. ఆమె పాడే జానపదాలకు ఆకర్షితుడయ్యారు. ఇళయరాజా ఆసక్తిని గమనించి తల్లి ఓ పాత హార్మోనియం పెట్టె కొనిచ్చింది. బడిలో చేరినప్పుడు తండ్రి జ్ఞాన దేశికన్ నుంచి డేనియల్ రాజయ్యగా మార్చారు. తన ఏడో ఏటనే తండ్రి రామస్వామిని కోల్పోయారు. ఆ తర్వాత ఇళయరాజాకు సంగీత పరికరాలే నేస్తాలయ్యాయి. తండ్రి మరణంతో ఇల్లు గడవటం కష్టంగా మారింది. తన సోదరులకూ సంగీతంపై ఆసక్తి ఉండటంతో 1958లో పెద్దనాన్న కుమారుడు పావలార్ వరదరాజన్ తో కలిసి 14 ఏళ్ల వయసులో ఇళయరాజా పావలార్ బ్రదర్స్ ఆర్కెస్ట్రా పెట్టారు. సౌత్ ఇండియా అంతా తిరుగుతూ ప్రదర్శనలిచ్చారు. ఓ ప్రొఫెసర్ దగ్గర వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్‌లో టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఇన్‌స్ట్రుమెంటల్ పర్‌ఫార్మెన్స్ గురించి అధ్యయనం చేశారు. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు. చివరకు తొలిసారిగా 1976లో అన్నక్కిలి సినిమాకి సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేశారు ఇళయరాజా. తమిళ సినీ చరిత్రలో ఇదో క్లాసిక్ మూవీ. ఆ తర్వాత ఇళయరాజా వెనుదిరిగి చూసుకోలేదు. అందుకే మణిరత్నం తన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా ఫస్ట్ చాయిస్ అయ్యారు. పల్లవి అనుపల్లవి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది.అప్పటి నుంచి మణి,రాజాల అనుబంధం కొనసాగుతోంది. ఆ తర్వాత ఇద్దరు దిగ్గజాలు.. సపరేట్గా ఎన్ని సినిమాలు చేసినా....వీరి కలయికలో వచ్చినవి మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.
ఎన్నో హిట్స్..
మణిరత్నం, ఇళయరాజా కలిసి పని చేసిన రెండో చిత్రం ఉనరు. ఇది మలయాళం మూవీ. మోహన్‌లాల్ హీరో. ఇందులో ఎస్.జానకి పాడిన దీపమే, తీరమ్ తేడి ఓలమ్ పాడి అనే పాటలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. తర్వాత వీరి కాంబోలో ‘పాగల్ నిలవు’ అనే గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ వచ్చింది. తమిళంలో మణిరత్నం డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇది. మురళి, రేవతి, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. వాటిలో రెండింటిని స్వయంగా ఇళయరాజానే పాడటం విశేషం. ఆ తర్వాత మోహన్, అంబిక, రాధలతో ‘ఇదయ కోవిల్’ మూవీని మణిరత్నం తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో ‘అనురాగ సంగమంగా డబ్ అయ్యింది. ఓ భగ్న ప్రేమికుడి కథ ఇది. హీరో సింగర్ కావడంతో మ్యూజిక్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకు తగ్గట్టే నా బాధ మౌనరాగం, నాగమల్లి తోటలలో, హృదయం ఒక గుడి లాంటి అద్భుతమైన పాటలు ఇచ్చారు ఇళయరాజా.
అన్నీ ఆణిముత్యాలే!
‘మౌనరాగం’ సినిమాకి ముందు మణిరత్నం, ఇళయరాజా కలిసి పని చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా నుంచి వాళ్లు సాధించిన విజయాలు వేరు. మోహన్, రేవతి, కార్తీక్ లీడ్ రోల్స్ చేసిన ‘మౌనరాగం’ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో.. ఆ పాటలు సినిమాకి మించి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పటికీ ఈ సినిమాని గొప్ప క్లాసిక్‌గా చెబుతారు. ఆ పాటలన్నీ ఆణిముత్యాలని ప్రశంసిస్తారు. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లాడి నలిగిపోయే యువతి కథ ఇది. భర్తపై ఆమె అయిష్టానికి, భార్యపై అతనికున్న అమితమైన ప్రేమకి మధ్య సాగే ఎమోషనల్ స్టోరీ. కథ, కథనం ఎంత గొప్పగా ఉంటాయో.. బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలు అంతే గొప్పగా అనిపిస్తాయి. చెలీ రావా వరాలీవా, మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలలో లాంటి పాటలు ఇప్పటికీ శ్రోతల్ని ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.
నాయకుడు నచ్చేశాడు
గ్యాంగ్‌స్టర్ డ్రామా అనగానే సౌత్ ప్రేక్షకులకి ముందుగా గుర్తొచ్చే సినిమా ‘నాయకుడు’. టైటిల్ రోల్‌లో కమల్ హాసన్ నటన మరపురానిది. ఆయన క్యారెక్టర్‌ని, ఆ సినిమాని మణిరత్నం డిజైన్ చేసిన తీరు మర్చిపోలేనిది. అనుకోని పరిస్థితుల్లో ఒక వ్యక్తి గ్యాంగ్‌స్టర్ అవడం, అతని మనసులో ప్రేమ చిగురించడం, ఆమె శత్రువుల చేతిలో చనిపోవడం, కొడుకు హత్యకి గురవ్వడం, కూతురు దూరమైపోవడం.. చాలా స్ట్రగుల్ ఉంటుంది అతని జర్నీలో. అది మణి టేకింగ్‌లోనే కాదు.. రాజాగారి మ్యూజిక్‌లో కూడా కనిపిస్తుంది మనకి. యాక్షన్ సీన్స్ని ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ గూజ్‌బంప్స్ తెప్పించిందంటే అతిశయోక్తి కాదు. ‘నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది.. ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు’ అనే పాట ఇప్పటికీ శ్రోతల మనసుల్ని మెలిపెడుతూనే ఉంది. ‘చలాకీ చిన్నది ఉంది’ పాట కుర్రకారుకి గిలిగింతలు రేపుతూనే ఉంది. ‘ఏదో తెలియని బంధమిది’ పాట ప్రేమలోని గొప్పదనాన్ని వివరిస్తూనే ఉంది. ఇలా నాయకుడు అందరికీ నచ్చడానికి రాజాగారి సంగీతం కూడా ఓ ముఖ్య కారణమైంది.
సంగీత సం‘ఘర్షణ’
ప్రభు, కార్తీక్ హీరోలుగా నటించిన ‘ఘర్షణ’ సినిమాకి తమిళ వెర్షన్ అగ్ని నచ్చత్తిరం. ఈ సినిమా తమిళంలో ఎంత పెద్ద హిట్టయ్యిందో, తెలుగులోనూ అంతే మంచి విజయం సాధించింది. ఆ సక్సెస్‌లో ఇళయరాజా మ్యూజిక్‌ది మేజర్ పార్ట్. మణిరత్నం మూవీస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కామెడీ ట్రాక్ సెపరేట్‌గా ఉంటుంది. సినిమా అంతా సీరియస్‌గా నడుస్తుంది. క్యారెక్టర్స్ ఎక్కువ గోల చేయవు. డైలాగ్స్తో కంటే హావభావాలతోనే విషయాన్ని కన్వే చేసే సీన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఇళయరాజా పనితనం చూసి మతులు పోయాయి జనాలకి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ రేంజ్‌లో కూడా ఇవ్వొచ్చా అంటూ మెస్మరైజ్ అయిపోయారు. ఇక నిన్ను కోరే వర్ణం, రాజాధి రాజాధి రాజా, ఒక బృందావనం పాటలు నేటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉన్నాయంటే అప్పట్లో ఎంత ఊపేశాయో ఊహించవచ్చు.
గీతాంజలి ద గ్రేట్..
మణిరత్నం తెలుగులో తీసిన ఒకే ఒక్క సినిమా గీతాంజలి. నాగార్జున హీరో. అంతవరకు వచ్చిన మూవీస్‌లో లవర్ బోయ్‌లా క్యూట్‌గా, యంగ్ మేన్‌లా దుడుకుగా కనిపించిన అతణ్ని.. చావుకు దగ్గరై తనలో తానే నలిగిపోయే మెచ్యూర్డ్ మేన్‌గా మార్చేశారు మణిరత్నం. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రేమలో పడతాడు. ఆమె తన కంటే ముందు చనిపోతుందని తెలిసి తల్లడిల్లిపోతాడు. హీరోయిన్ చిలిపి వేషాలు.. హీరో బరువైన హావభావాలు.. మనసు కదిలిపోయింది ప్రేక్షకుడికి. ఆ కథ ఏదో నిజమే అయినట్టు, తమకు కావాలసినవాళ్లెవరో చనిపోతున్నట్టు బాధపడిపోయారు సినిమా చూసినవాళ్లంతా. వాళ్లని అంతగా ఇన్‌వాల్వ్ చేసింది మణిరత్నం స్క్రీన్‌ప్లే. అయితే ఆ సినిమా సక్సెస్‌లో క్రెడిట్ మొత్తం ఆయనకే ఇవ్వలేం. ఆయనతో సమానంగా ఇళయరాజాకి కూడా ఇవ్వాల్సిందే. ఓ ప్రియా ప్రియా, ఓ పాపా లాలి, ఆమని పాడవే హాయిగా.. మర్చిపోగలిగే పాటలా అవి! ‘నందికొండ వాగుల్లోన’ అంటూ దెయ్యం పాటకి కూడా మెలొడీ అద్ది తన గొప్పదనాన్ని చూపించారాయన. ‘నిను వీడని నీడను నేనే’ పాట తర్వాత ఆ స్థాయిలో గుర్తుండిపోయిన దెయ్యం పాట ఇదేనంటే ఎవ్వరూ కాదనలేరు.
అంజలి అందరిదీ!
హీరో హీరోయిన్లు లేరు. స్క్రీన్ మొత్తం పిల్లలే. పాటలూ వాళ్లవే. ఫైట్లూ వాళ్లవే. ప్రతి సీన్ వాళ్లదే. ఇలాంటి సినిమాని ఎవరైనా ఊహించగలరా.. మణిరత్నం తప్ప! చిన్నపిల్లల్నే ప్రధాన పాత్రల్లో పెట్టి ఈ సినిమా ప్లాన్ చేశారాయన. విలన్ పాత్రలేసే రఘువరన్‌ని కూల్ ఫాదర్‌గా మార్చారు. రేవతి లాంటి మంచి నటిని అతనికి భార్యగా పెట్టారు. మరో స్టార్ హీరో ప్రభుని నెగిటివ్ షేడ్స్లో కనిపించే పాజిటివ్ పాత్రగా చేశారు. వాళ్లందరి మధ్యలోకి ‘అంజలి’ అనే మానసిక సమస్య ఉన్న పాపని తీసుకొచ్చారు. ఆమెపై అందరికీ ప్రేమ పెంచారు. అంతలోనే తనని చంపేసి ఏడిపించారు. ఫన్‌ని, ఎమోషన్‌ని పర్‌ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఈ సినిమాని చైల్డ్ ఫిల్మ్స్లో ద బెస్ట్గా నిలబెట్టారు మణి. ఇలాంటి సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఏ సంగీత దర్శకుడికైనా పెద్ద చాలెంజ్. దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేవారు, న్యాయం చేయగలిగేవారు ఇళయరాజా మాత్రమే అని మణి నమ్మారు. ఆ నమ్మకం వమ్ము కాలేదు. అందుకే ‘అంజలి అంజలి అంజలి’ పాట ఇప్పటికీ మన మనసుల నుంచి చెరిగిపోలేదు.
సూపర్ ఫిల్మ్
ఇద్దరు స్టార్ హీరోల్ని పెట్టి సినిమా తీయాలంటే డేర్ ఉండాలి. ఇద్దరినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఫ్యాన్స్ కోప్పడితే ఏం చేయాలి, అసలు వాళ్లకి కోపమే రాకుండా ఎలా మేనేజ్ చేయాలి అంటూ తంటాలు పడుతుంటారు. కానీ అప్పట్లోనే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ని, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టినీ ఒకచోట చేర్చి ఓ సూపర్బ్ ఫిల్మ్ తీసి వారేవా అనిపించారు మణిరత్నం. ఎంతో గొప్ప ఇమేజ్ ఉన్న ఈ హీరోలిద్దరినీ బెస్ట్ ఫ్రెండ్స్గా చేసి ‘దళపతి’ తీశారు. ప్రేమ కోసం పరితపించే ఓ రౌడీ. అతనికి ఆ ప్రేమని అందించే మరో రౌడీ. ఇద్దరి మధ్య స్నేహం. వచ్చే సమస్యలు.. ఎదురయ్యే సవాళ్లు.. పొంగే ప్రేమలు.. ప్రవహించే కన్నీళ్లు.. ఒక పెద్ద ప్యాకేజ్ ఆ సినిమా. దాన్ని ఫుల్‌ఫిల్ చేసింది ఇళయరాజా సంగీతమేనంటే కాదనగలమా! సింగారాల పైరుల్లోన అంటూ ఇద్దరు స్టార్స్ స్టెప్పులేస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలలేదు ప్రేక్షకులకి. ‘ఆడజన్మకి ఎన్ని శోకాలో’ అంటూ ఓ తల్లి బాధతో పాడుకుంటుంటే కన్నీళ్లు ఆగలేదు చూసినవారికి. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
ఇవన్నీ ఈ దిగ్గజాల కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిపోయిన చిత్రాలే. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమాలే. అందుకే వీరిద్దరిదీ బెస్ట్ కాంబో అని అందరూ చెబుతారు. అయితే ఓ సమయం వచ్చాక ఇళయరాజాని కాదని వేరే వైపు మొగ్గు చూపారు మణిరత్నం. ‘రోజా’ సినిమాకి సరికొత్త శైలిలో సంగీతం కావాలని ఆశపడ్డారు. అందుకే రెహమాన్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. అలా అని ఇద్దరి మధ్య వివాదాలేం లేవు. ఇప్పటికీ ఒకరిని ఒకరు ఎంతో గౌరవించుకుంటారు. మణి గొప్ప దర్శకుడని రాజా మెచ్చుకుంటారు. ఆయన ఎప్పటికీ కింగ్ ఆఫ్ మ్యూజిక్కేనని మణి కితాబిస్తారు. ఇద్దరూ ఇద్దరేనని ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ ఇద్దరు ఎప్పటికీ.. సినీ వినీలాకాశంలో సూర్యచంద్రుల్లా ప్రత్యేకంగా నిలిచిపోయేవారే!