ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపుల కారణంగా బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న శారద, కుమార్ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు సంతానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొదటి అమ్మాయి శాలిని సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో వసతి గృహంలో ఉంటూ తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల ఆమె బాలాజీ నగర్ లోని తన ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన శివా అనే యువకుడు బాలిక వెంట ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిన్న రాత్రి సమయంలో శివ వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.