కులం పేరుతో తోటి విద్యార్థుల వేధింపులు.. మనస్తాపంతో ఎంబీబీఎస్ స్టూడెంట్​ సూసైడ్

ఎల్బీ నగర్, వెలుగు : కులం పేరుతో తోటి విద్యార్థులు వేధించారని మనస్తాపంతో ఓ విద్యార్థిని బిల్డింగ్  పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్  స్టేషన్  పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లికి చెందిన ప్రభాకర్  రావు దంపతులకు కుమారుడు తరుణ్ సాయి, కుమార్తె విద్యా ప్రియాంక (18) ఉన్నారు. తరుణ్  ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.

కుమార్తె విద్యా ప్రియాంక హయత్  నగర్​లోని దవావో ఇంటర్నేషనల్ మెడికల్ అకాడమీలో ఎంబీబీఎస్  ఫస్టియర్  చదువుతూ నీట్ ఎగ్జామ్స్  కోసం కోచింగ్  తీసుకుంటోంది. ఆమెతోపాటు మరో నలుగురు విద్యార్థినులు కూడా ఒకే రూంలో ఉంటున్నారు. ఈ క్రమంలో విద్యా ప్రియాంక నీట్ కు అప్లై చేస్తున్న సమయంలో సర్టిఫికెట్లను అప్ లోడ్ చేస్తుండగా తోటి స్టూడెంట్లు ఆమెను కులం పేరుతో దూషించారు. ఆమెతో వేరే విద్యార్థినులను మాట్లాడనీయకుండా  మానసిక క్షోభకు గురిచేశారు.

దీనిపై బాధితురాలు అకాడమీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన విద్య ప్రియాంక.. సోమవారం రాత్రి కోచింగ్  సెంటర్  బిల్డింగ్  పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ప్రభాకర రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.