ఆన్​లైన్‌లోనూ అమ్మాయిలపై వేధింపులు

సోషల్ మీడియా వాడుతున్న వారిలో 58 శాతం మందికి హరాస్ మెంట్
వెకిలి కామెంట్ లు.. విద్వేషపూరిత పోస్టులు
ఫిజికల్ గా ఇబ్బంది పెడతామని బెదిరింపులు

22 దేశాల్లో 14 వేల మందిపై ప్లాన్ ఇంటర్నేషనల్ స్టడీ

ఇంటా, బయటే కాదు.. ఆన్​లైన్​లోనూ అమ్మాయిలకు వేధింపులే. ఫేస్​బుక్, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్​ వంటి సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​లో అకౌంట్లున్న అమ్మాయిలకు నిత్యం అభ్యంతరకర కామెంట్లు, వివక్షాపూరిత పోస్టులే. ఏదో కొందరు కాదు.. 58 శాతం మంది ఈ హరాస్​మెంట్​ను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సెక్సువల్​ కామెంట్లు, ఫిజికల్​గా దాడులు చేస్తామన్న బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఇట్లా ఇబ్బందిపెడ్తున్న వారిలో అమ్మాయిలకు తెలియనివారే కాదు.. వారికి తెలిసినవారు, ఫ్రెండ్స్, కొలీగ్స్​ కూడా ఉంటున్నారు. బ్రిటన్​కు చెందిన ప్లాన్​ ఇంటర్నేషనల్​ అనే స్వచ్చంద సంస్థ చేసిన స్టడీలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

22 దేశాల్లో స్టడీ

ప్లాన్​ ఇంటర్నేషనల్​ సంస్థ.. ఇండియా, అమెరికా, బ్రెజిల్, నైజీరియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, థాయిలాండ్ సహా 22 దేశాల్లో ఈ స్టడీ చేసింది. 15 ఏండ్ల నుంచి 22 ఏండ్ల మధ్య వయసున్న 14 వేల మంది అమ్మాయిలతో మాట్లాడి.. ఆన్​లైన్​లో ఎదుర్కొంటున్న వేధింపులు, ఇబ్బందుల వివరాలు సేకరించింది. ఈ ఏడాది ఏప్రిల్​1 నుంచి మే 5 మధ్య తీసుకున్న డేటాతో ఓ రిపోర్టును రూపొందించింది. ఈ నెల 11న ఇంటర్నేషనల్​ గర్ల్​చైల్డ్​ డే సందర్భంగా ‘స్టేట్​ ఆఫ్​ ది వరల్డ్స్​ గర్ల్స్ రిపోర్ట్’పేరిట దీనిని విడుదల చేసింది.

ప్రపంచమంతటా అదే దుస్థితి

ఓ దేశం, ఓ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని కాంటినెంట్స్​​లో అమ్మాయిలు ఆన్​లైన్​ వేధింపులకు గురవుతున్నట్టు ప్లాన్​ ఇంటర్నేషనల్​ రిపోర్టు వెల్లడించింది. యూరప్​లో అత్యధికంగా 63 శాతం మంది అమ్మాయిలు హరాస్​మెంట్​ బారినపడుతున్నారని తెలిపింది. లాటిన్​ అమెరికాలో 60 శాతం, ఆసియా పసిఫిక్​ రీజియన్​లో 58 శాతం, ఆఫ్రికాలో 54 శాతం, నార్త్​ అమెరికాలో 52 శాతం అమ్మాయిలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

వెకిలి కామెంట్లు, విద్వేషపూరిత పోస్టులతో..

సోషల్​ మీడియాలోని తమ అకౌంట్లలో వెకిలి, సెక్సువల్​ కామెంట్లు విపరీతంగా వస్తున్నాయని చాలా మంది అమ్మాయిలు స్టడీలో వెల్లడించారు. తమ ప్రాంతాన్ని, కుల, మతాలను బట్టి కొందరు విద్వేష, వివక్షాపూరిత పోస్టులు చేస్తూ ఇబ్బందిపెడుతున్నారని.. దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. తమపై ఫిజికల్, సెక్సువల్​ దాడులు చేస్తామంటూ హరాస్​మెంట్​ జరుగుతోందని 47 శాతం మంది అమ్మాయిలు తెలిపారు. అవమానించేలా, ఇష్టమొచ్చినట్టు తిడుతూ వెకిలి కామెంట్లు వస్తున్నాయని ఏకంగా 59 శాతం మంది చెప్పారు. ఇక తమ అకౌంట్లలో మైనారిటీ వర్గాలకు చెందినవారిగా పెట్టుకుంటే.. హరాస్​మెంట్​ మరింత దారుణంగా ఉంటోందని ప్లాన్​ ఇంటర్నేషనల్​ నివేదిక పేర్కొంది. ఎల్ జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్​జెండర్) కమ్యూనిటీకి చెందినట్టుగా అకౌంట్లలో పేర్కొన్న అమ్మాయిల్లో 42% వేధింపులు భరించాల్సి వస్తోందని తెలిపింది.

తెలిసినవాళ్లూ బాధపెడ్తున్నరు

అమ్మాయిలపై ఆన్​లైన్​ వేధింపులకు పాల్పడుతున్నవారిలో వారికి తెలియనివారెవరో మాత్రమే కాకుండా.. తెలిసినవారు కూడా ఎక్కువగానే ఉంటున్నట్టు స్టడీ వెల్లడించింది. అయితే తెలియని వారి నుంచి జరుగుతున్న హరాస్​మెంట్​ తరచుగా, చాలా ఇబ్బందికరమైన స్థాయిలో ఉంటోందని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న అమ్మాయిల్లో 11 శాతం మంది తమ ప్రస్తుత, మాజీ పార్ట్​నర్​ నుంచి.. 21 శాతం మంది ఫ్రెండ్స్​ నుంచి, 23 శాతం మంది తమ స్కూల్, కాలేజీ, ఆఫీసు పరిచయస్తుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. తమకు తెలియనివాళ్లు, తప్పుడు వివరాలతో అకౌంట్లు మెయింటైన్​ చేస్తున్నవారి నుంచి హరాస్​మెంట్​ ఎదురవుతోందని 68 శాతం మంది చెప్పారు. చిత్రమైన విషయం ఏమిటంటే మహిళల పేర్లతో ఉన్న ఫేక్​ అకౌంట్ల నుంచి వెకిలి కామెంట్లు వస్తున్నాయని 40 శాతం అమ్మాయిలు వెల్లడించారు.

బాధతో కుంగిపోతున్నరు

ఆన్​లైన్​ వేధింపుల కారణంగా చాలా మంది తాము మానసికంగా కుంగిపోతున్నామని స్టడీలో వెల్లడైంది. మెంటల్​గా, ఎమోషనల్​గా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని 42 శాతం మంది చెప్పగా.. తమలో సెల్ఫ్​ కాన్ఫిడెన్స్​ తగ్గిపోతోందని మరో 42 శాతం మంది వాపోయారు. ఈ హరాస్​మెంట్​ కారణంగా సోషల్​ మీడియాను వదిలిపెట్టేశామని, వాడటం చాలావరకు తగ్గించేశామని 20 శాతం మంది అమ్మాయిలు చెప్పారు. మరో పన్నెండు శాతం మంది తమ అకౌంట్లలో వెల్లడించే అభిప్రాయాలను మార్చేసుకున్నామని తెలిపారు.

For More News..

అసెంబ్లీకి పోటీ చేయకుండానే ఐదుసార్లు సీఎం

దేశంలో రోజూ 10 మందిపై అకృత్యాలు