బీజేపీకి ఎదురీతేనా?

బీజేపీకి ఎదురీతేనా?

హర్యానా, జమ్మూ-కశ్మీర్‌‌‌‌  ఎన్నికలు.. ఫలితాల పరంగానే కాక సంకేతాల రీత్యా కూడా బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌కు ఎంతో ప్రతిష్టాత్మకం! ఈ గెలుపోటములు ఆయా రాష్ట్రాల్లో పార్టీల రాజకీయ బలాల్ని తెలపడమే కాక త్వరలో జరగనున్న ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ప్రభావితం చేయనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ, ఇండియా కూటముల సమీకరణాల మీద కూడా ఈ ఫలితాల ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ముఖ్యంగా పాలకపక్షమైన బీజేపీకి  రెండు రాష్ట్రాల్లోనూ ఇది పరీక్షే!  పదేండ్లు పాలకపక్షాలుగా ప్రజావ్యతిరేకత వల్ల బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీల ప్రభ తగ్గుతున్న సంకేతాలు ఓ వైపు,  ప్రత్యర్థి కాంగ్రెస్‌‌‌‌- ఇండియా కూటమి పక్షాలు పుంజుకుంటున్న వాతావరణం మరోవైపు బలపడుతూ వస్తోంది.

ఆశించినదానికన్నా తక్కువ ఫలితాలు దక్కిన 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల తర్వాత, వస్తున్న తొలి అసెంబ్లీ ఎన్నికలే  బీజేపీకి పరీక్షగా నిలుస్తున్నాయి. పవనాలు వ్యతిరేకంగా వీస్తున్నట్టు క్షేత్ర సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పదేండ్లుగా అధికారంలో ఉన్న హర్యానాలో,  ఆర్టికల్​370 ఎత్తివేత తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుపుతున్న జమ్మూ- కశ్మీర్‌‌‌‌లో బీజేపీకి ఎదురుగాలి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులకు కొంత మెరుగైన వాతావరణం ఉంది. 2014 అసెంబ్లీ  ఎన్నికల్లో  గెలిచి హర్యానాలో  సొంత ప్రభుత్వం ఏర్పరచిన బీజేపీ, 2019లో జననాయక్‌‌‌‌ జనతా పార్టీతో  కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచింది. జమ్మూ-కశ్మీర్‌‌‌‌లో 2014 ఎన్నికల తర్వాత పీపుల్స్‌‌‌‌ డెమాక్రటిక్‌‌‌‌ పార్టీ (పీడీపీ),  బీజేపీలు కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పరిచాయి. 2018లో ప్రభుత్వం పడిపోయి, రాష్ట్రపతి  పాలన అమల్లో ఉండగానే  కశ్మీర్‌‌‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి  కల్పించే భారత రాజ్యాంగపు ఆర్టికల్​370ని ఎత్తివేశారు.  జమ్మూ-కశ్మీర్‌‌‌‌,  హర్యానాల్లో సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 5 మధ్య ఎన్నికలు ముగిసి,  అక్టోబరు 8న ఫలితాలు వెలువడనున్నాయి.  

2024లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీని జమ్మూ-కశ్మీర్‌‌‌‌ లో  కోరింది 27 శాతం కాగా,  రాహుల్‌‌‌‌ గాంధీని కోరుకుంటున్నవారు 35 శాతంగా సర్వే గణాంకాలు చెప్పాయి. హర్యానాలో  జేజేపీ  గ్రాఫ్‌‌‌‌  పడిపోతుంటే జమ్మూ-కశ్మీర్‌‌‌‌లో బీజేపీతో పాటు పీడీపీ పరిస్థితి అధ్వానంగానే ఉంది.  బీజేపీకి బీ-టీమ్‌‌‌‌గా
 ప్రచారంలో ఉన్న గులామ్‌‌‌‌ నబీ ఆజాద్‌‌‌‌ పార్టీ అసలు ఖాతా తెరుస్తుందా? అన్నది అనుమానమే! మరోపక్క నేషనల్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌ , కాంగ్రెస్‌‌‌‌ మధ్య పొత్తు  కుదిరింది. ఇప్పటికే కశ్మీర్‌‌‌‌లో రెండుమార్లు పర్యటించిన రాహుల్‌‌‌‌, దీన్నంత ప్రతిష్టాత్మకంగా భావించినందునే పార్టీ అధినేత ఖర్గే,  కేసీ వేణుగోపాల్‌‌‌‌ తదితరులతో కూడి వెళ్లి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. బీజేపీ కూడా అయిదేండ్ల విరామం తర్వాత ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ముఖ్యుడు రాంమాధవ్‌‌‌‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది.

వేగంగా పరిణామాలు

హర్యానాలో  రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి మోదీని పూర్తిస్థాయి రాజకీయ నేతగా మార్చిన తొలి రాజకీయ క్షేత్రమిది.  బలమైన సామాజికవర్గం జాట్‌‌‌‌లు. 2019 ఎన్నికల్లో  పది అసెంబ్లీ స్థానాలు నెగ్గి,  బీజేపీతో సంకీర్ణ సర్కారు ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జేజేపీ  తాజా (2024) లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో నిస్తేజమైన ఫలితాలనే పొందింది.  దాని మాతృక అయిన ఇండియన్‌‌‌‌  నేషనలిస్ట్‌‌‌‌ లోక్‌‌‌‌దళ్‌‌‌‌ (ఐఎన్‌‌‌‌ఎల్డీ) ప్రాభవం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది.  జాటేతర వర్గాల్లో పట్టుకోసం బీజేపీ ఇతర బీసీ సామాజికవర్గాల (ఓబీసీ) మీద దృష్టి కేంద్రీకరిస్తోంది. లోక్‌‌‌‌సభ ఎన్నికల ముందు, నాటి సీఎం మనోహర్‌‌‌‌లాల్‌‌‌‌ కట్టర్‌‌‌‌ ను మార్చి ఓబీసీ వర్గాలకు చెందిన నాయబ్‌‌‌‌ సింగ్‌‌‌‌ సైనీని ముఖ్యమంత్రి చేసి.. వారి నుంచి పెద్దమద్దతు ఆశించింది. 

2014,  2019  రెండు ఎన్నికల్లో మొత్తం 10 లోక్‌‌‌‌సభ స్థానాలు నెగ్గి  క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసిన బీజేపీ తాజా ఎన్నికల్లో  సగం స్థానాలు కాంగ్రెస్‌‌‌‌కు కోల్పోయి 5 చోట్ల నెగ్గింది. ఓట్లవాటా కూడా 2019 లో పొందిన 58 శాతం నుంచి సుమారు  46.1 గా నమోదైంది.  2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటు వాటా రమారమి 10 శాతం తగ్గి 36.5 శాతానికి, గెలిచిన స్థానాలు (40/90) కి పరిమితమైంది. వరుస అధికారం వల్ల వచ్చే ప్రజావ్యతిరేకతకు తోడు కూటమి భాగస్వామిగా ఉన్న జేజేపీ పలుకుబడి  తగ్గడం ప్రతికూల సంకేతమే! లోక్‌‌‌‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌‌‌‌   గ్రాఫ్‌‌‌‌ పెరుగుతున్నట్టు పీపుల్స్‌‌‌‌ పల్స్‌‌‌‌’ సహా ఇతర సంస్థల సర్వేల్లో వెల్లడయింది. 90 స్థానాలున్న అసెంబ్లీ బరిలో దిగేందుకు కాంగ్రెస్‌‌‌‌ టిక్కెట్ల కోసం పెరిగిన రద్దీనే ఇందుకో సంకేతం!

కశ్మీరీల మనసు గెలవటం పరీక్షే!

ఎన్నికల బహిష్కరణ కోరే కశ్మీరీలు ఈసారి ఎన్నికల్లో పాల్గొని తమ మనోగతాన్ని వెల్లడించాలనుకుంటున్నారు. ఇది ఎవరి కోసమో? మరెవరికి వ్యతిరేకమో! గుర్తెరగాలి. నిన్నటి ఎన్నికల్లో రికార్డు స్థాయి, 58.6 శాతం మంది పోలింగ్‌‌‌‌లో పాల్గొన్నారు.  పూర్వపు రాష్ట్రహోదా కల్పించాలని అత్యధికులు కోరుకుంటున్నట్టు పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చర్లు స్థానికులతో ముచ్చటించినపుడు స్పష్టమౌతోంది.  గత  కొంతకాలంగా నేషనల్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌, పీడీపీలు ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్‌‌‌‌,  బీజేపీలకు బీ.టీమ్‌‌‌‌లు గానే ప్రచారముంది. అందరికీ, అన్ని చోట్ల ఏకరీతి జనాదరణ లేదు.

జమ్మూలో కొందరికి పట్టుంటే కశ్మీర్‌‌‌‌ లోయ ప్రాంతంలో మరికొందరికి ఆధిపత్యం ఉంది. మొత్తంగా చూసినపుడు... తాజా పరిణామాల్లో ఏ కూటమికి కశ్మీరీల ఆదరణ లభిస్తుంది? అన్నదే ప్రశ్న! లోయ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకతే కాకుండా ఆ పార్టీతో అంటకాగినారనే అభియోగంతో పీడీపీ పట్ల కూడా కశ్మీరీలు కొంత ఆగ్రహంగా ఉన్నట్టు ఇటీవలి ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.

2014 ఎన్నికల్లో 28 అసెంబ్లీ స్థానాలు నెగ్గి, బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీడీపీ ఆధిక్యత 2024 వచ్చేసరికి 5 సెగ్మెంట్లకు పడిపోయింది. కశ్మీరీలకు కాంగ్రెస్‌‌‌‌పై ప్రేమ ఉన్న దాఖలాలు కూడా లేవు. 2014లో 12 అసెంబ్లీ సీట్లు గెలిచిన కాంగ్రెస్‌‌‌‌ ఆధిక్యత తాజా ఎన్నికల్లో 7కు పడిపోయింది. లోయను పూర్తిగా వదిలేసి, ఆరింట మూడు లోక్‌‌‌‌సభ స్థానాలు మాత్రమే పోటీ చేసిన బీజేపీ తన 2 స్థానాలను (జమ్ము, ఉదమ్‌‌‌‌పూర్‌‌‌‌) నిలబెట్టుకుంది. కానీ, ఓటు వాటాలు గణనీయంగా తగ్గాయి.  గెలిచిన ఎంపీ స్థానాల పరిధి అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ పట్టు పెరిగింది. అలా, అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత, గతం (25) కన్నా కొంచెం (29) పెంచుకోగలిగింది. 

 

మోదీ బేషరతు క్షమాపణలు

 

మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కుప్పకూలినందుకు, తన స్వభావానికి విరుద్ధంగా మోదీ బేషరతు క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్ర రాజకీయాల్ని బీజేపీ ఎలా అంచనా వేస్తోంది?  హర్యానాలో  బీజేపీతో సఖ్యత ఉన్న జేజేపీ జనాదరణ కోల్పోతే,  జమ్మూ కశ్మీర్‌‌‌‌లో  కాంగ్రెస్‌‌‌‌తో  పొత్తు కుదుర్చుకున్న ఎన్సీ తన పరిస్థితి మెరుగుపరుచుకుంది. 2014లో ఎన్సీకి 15 స్థానాలు లభిస్తే, 2024 తాజా ఎన్నికల్లో వారి ఆధిక్యత 36కి విస్తరించింది. కాంగ్రెస్‌‌‌‌ ఆధిక్య స్థానాల (7)తో కలిస్తే... 43, అంటే మ్యాజిక్‌‌‌‌ ఫిగర్‌‌‌‌ (46/90) కి సమీపంలో ఉన్నారు.

తగ్గుతున్న మోదీ హవా

అసెంబ్లీల ఎన్నికల కన్నా లోక్‌‌‌‌సభ ఎన్నికల్లోనే మోదీ హవా ఎక్కువ!  2019 మీద, 2024 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా వీస్తున్న మోదీ హవాలో తరుగుదల సీఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌- లోక్‌‌‌‌నీతి సర్వేలో వెల్లడయింది. సీట్లపరంగానూ ఇది ప్రతిబింబించింది.  లోక్‌‌‌‌సభ ఎన్నికల్లోనే  ఇలా ఉంటే,  ఇక రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల్లో  ‘మోదీ’ మంత్రం జపించినా ఫలితాలు ఆశావహంగా ఉండకపోవచ్చని అంచనా!  హర్యానాలో పోలింగ్‌‌‌‌ అనంతర  సర్వే ప్రకారం,  2019లో 57 శాతం మంది మోదీ ప్రధాని కావాలని కోరుకుంటే, 2024లో 32 శాతం మందే ఆ కోరిక వెల్లడించారు. అదే, కాంగ్రెస్‌‌‌‌ నేత రాహుల్‌‌‌‌ విషయంలో ప్రజాదరణ సూచీ భిన్నంగా ఉండింది. 2019లో రాహుల్‌‌‌‌ను ప్రధానమంత్రి కావాలని కోరుకున్న వారు 15 శాతం కాగా, 2024 నాటికి అది 30 శాతానికి పెరిగింది. 

- దిలీప్‌‌‌‌రెడ్డి, పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ