వ్యాపారం పేరుతో తోబుట్టువులను మోసం చేశాడనే ఆరోపణలపై హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాల సోదరుడు వైభవ్ పాండ్యా(37)ను ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తమ్ముళ్లు క్రికెట్ పనుల్లో బిజీగా ఉంటే.. అన్న వచ్చిన లాభాల్లో నిధులు దారి మళ్లించి భారీగా ఆస్తులు వెనకేసుకున్నాడు. ముగ్గురూ కలిసి పెట్టుబడిన సంస్థ మాత్రం నష్టాల్లో కూరుకుపోయింది. ఇది తెలిసిన హార్దిక్, కృణాల్ సోదరులు.. ఆర్థిక లావాదేవీలను పరిశీలించగా నిధులు దారి మళ్లిన సంగతి వెలుగులోకి వచ్చింది. దీనిపై పాండ్యా సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వైభవ్ పాండ్యాను అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయంపై వైభవ్ పాండ్యా ఎట్టకేలకు మౌనం వీడాడు. శుక్రవారం(ఏప్రిల్ 12) ముంబై కోర్టు ముందు హాజరైన వైభవ్.. ఈ విషయం తమ కుటుంబ పరిధికి లోబడి ఉందని, తన సోదరులు కేవలం అపార్థం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులో వైభవ్ పాండ్యా పోలీసు కస్టడీని ఏప్రిల్ 16 వరకు పొడిగించారు.
VIDEO | Vaibhav Pandya, cricketer Hardik Pandya's stepbrother, produced before a #Mumbai court.
— Press Trust of India (@PTI_News) April 12, 2024
The Mumbai police had arrested Vaibhav Pandya for allegedly cheating Hardik and his brother Krunal in polymer business to the tune of more than Rs 4 crore.
(Full video available on… pic.twitter.com/BNUwZDhaPW
ఏంటి ఈ వ్యాపారం..?
రెండేళ్ల క్రితం అనగా.. 2021లో హార్దిక్, కృణాల్, వైభవ్ పాండ్యాలు కలిసి పాలిమర్ వ్యాపారం మొదలుపెట్టారు. ఇందులో హార్దిక్, కృనాల్ 40 శాతం చొప్పున, వైభవ్ 20 శాతం పెట్టుబడి పెట్టారు. పెట్టిన పెట్టుబడి ప్రకారం వచ్చిన లాభాలు పంచుకోవాలని మొదట నిర్ణయించుకున్నారు. అయితే, కొన్నాళ్లు గడిచాక వైభవ్ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. సోదరులకు తెలియకుండా రూ.4.3 కోట్ల నిధులను దారి మళ్లించాడు. ఆ నిధులతో మరో వ్యక్తితో కలిసి అదే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. దీని కారణంగా అసలు సంస్థ నష్టాల బాట పట్టింది. హార్దిక్, కృనాల్‌లకు రూ.3 కోట్ల నష్టం వాటిల్లగా.. వైభవ్ సొంత కంపెనీ లాభం 20-33 శాతం పెరిగింది.
నష్టాలు ఎందుకొచ్చాయని తమ్ముళ్లు లెక్కలు ఆరాతీయగా.. నిధులు దారి మళ్లిన సంగతి వెలుగులోకి వచ్చింది. దీనిపై అతన్ని నిలదీయగా బెదిరింపులకు దిగాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, కాదని ఎవరికైనా చెప్తే వారి ప్రతిష్టను దిగజారుస్తానని బెదిరింపులకు దిగాడు. దీనిపై పాండ్యా సోదరులు ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు... సెక్షన్ 420, 406, 408, 465, 467, 471, 34, 120 B, మరియు 506 కింద కేసులు నమోదు చేశారు. తదుపరి ఈ కేసు ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయబడింది.