టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఒక అంచనాకు రావడం కష్టం. కొన్నిసార్లు అతను చేసేవి కరెక్ట్ అనిపించినా మరికొన్ని విమర్శలకు గురి చేస్తాయి. తన చేష్టలతో మ్యాచ్ లో ఏదో రకంగా అందరి ద్రుష్టి తనవైపే ఉండేలా చూసుకుంటాడు. ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ వేదికగా మంగళవారం (జనవరి 28) జరిగిన మూడో టీ20లో పాండ్య తీరు ఎవరికీ నచ్చలేదు. అతని అత్యుత్సాహంతో టీమిండియా గెలిపిద్దామనుకుంటే కుదరలేదు.
అసలేం జరిగిందంటే..?
టీమిండియా విజయానికి చివరి 13 బంతుల్లో 41 పరుగులు చేయాలి. ఈ దశలో ప్రతి పరుగు కీలకమే. 18 ఓవర్ చివరి బంతిని జురెల్ దూరంగా కొట్టడంతో సింగిల్ తిరాగాల్సి వచ్చింది. ఈజీగా సింగిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్య సింగిల్ వద్దని జురెల్ ను వెనక్కి పంపించాడు. దీంతో గ్రౌండ్ లో అభిమానులు అందరూ షాకయ్యారు. తాను అనుకున్నట్టుగానే 19 ఓవర్ తొలి బంతికి స్ట్రైకింగ్ తీసుకున్న హార్దిక్.. భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో హార్దిక్ ఇన్నింగ్స్ ముగియడంతో పాటు మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళింది. మ్యాచ్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ పాండ్య 40 పరుగులు చేయడానికి 35 బంతులు తీసుకున్నాడు.
ALSO READ | SL vs AUS: ఆడేది ఐపీఎల్ కాదు టెస్ట్ మ్యాచ్: శ్రీలంకపై హెడ్ మెరుపు హాఫ్ సెంచరీ
జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్ అయినప్పటికీ ఎందుకు సింగిల్ తిరగలేదని నెటిజన్స్ తో పాటు క్రికెట్ ఎక్స్ పర్ట్స్ పాండ్యని విమర్శిస్తున్నారు. పాండ్యకు గర్వం ఉందని.. అతని ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 145 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.